అత్యాచారం.. అనంతర వివాహంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక మహిళను, లేదా యువతిని అత్యాచారం చేసిన తర్వాత.. పోలీసులు కేసు నమోదు చేశాక.. రాజీ పడి ఆమెను పెళ్లి చేసుకున్నప్పటికీ.. రేప్ కేసు కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే.. సమాజంలో పరిస్థితి వేరేగా ఉంటుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.
ఏం జరిగిందంటే..
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో 19 ఏళ్ల యువతిపై పొరుగింటియువకుడు అత్యాచారం చేశాడు. ఇది జరిగి నాలుగే ళ్లయింది. అప్పట్లో యువతి, ఆమె బంధువులు యువకుడిని చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నాడు. అయితే.. తర్వాత జరిగిన పరిణామాల్లో నిందితుడి.. కుటుంబం, బాధితురాలి కుటుంబం ఇరువురికి పెళ్లి చేయాలని నిర్ణయించాయి.
దీంతో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు.. రెండేళ్ల కిందట సదరు యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ, అతనిపై ఉన్న ‘రేప్’ కేసు మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాధితురాలిగా ఉన్న యువతిని తాను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో తనపై నమోదైన రేప్ కేసును కొట్టివేయాలని ఆయన భార్యా(బాధితురాలు) సమేతంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కోర్టు.. ఇలా చేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. పెళ్లికి ముందు జరిగిన ఘటనను అదేవిధంగా విచారించాల్సి ఉంటుందని.. ఈ కేసులో తీర్పు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనని తేల్చి చెప్పింది. రేప్ చేసి.. వివాహం చేసుకుంటామంటే.. సమాజంలో వ్యతిరేక ప్రభావం పడుతుందని పేర్కొంది. కాబట్టి.. ఎఫ్ ఐఆర్ కొట్టేసేందుకు.. కేసును తొలగించేందుకు కుదురదని తేల్చి చెప్పింది.