పాక్ జట్టుపై గంగూలీ షాకింగ్ కామెంట్స్

ప్రపంచ కప్ క్రికెట్ లో దాయాదుల మధ్య పోరు కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుందన్న సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్ ను ఆస్వాదించేందుకు ఇరు దేశాల క్రికెట్ అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ రెడీ అవుతుంటారు. ఆ అంచనాలకు తగ్గట్లే ఇండో-పాక్ మ్యాచ్ హై టెన్షన్ వాతావరణంలో జరుగుతుంటుంది. అయితే, ఈ ఏడాది మన దేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ సందర్భంగా పాక్ పై భారత్ సునాయస విజయాన్ని అందుకుంది.

దీంతో, స్వదేశంలో పాకిస్థాన్ పై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి తోడు టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి పాక్ కెప్టెన్ జెర్సీ తీసుకున్న వైనంపై కూడా పాక్ మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. బాబర్ ఆజమ్ మైదానం లోపల, వెలుపల పాక్ జట్టును నిరాశపరిచాడని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ టీం లో మునుపటి చేవ కనిపించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పాక్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టులో పోరాట స్ఫూర్తి లేదని, ఈ టీంలోని ఆలగాళ్లలో మునుపటి కసి కనిపించడం లేదని గంగూలీ చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. గతంలో పాకిస్థాన్ జట్టు బలంగా ఉండేదని, హోరాహోరీగా మ్యాచ్ లు జరిగేవని దాదా అన్నాడు. ఇక, బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ల ఆటలో కసి లేదని, టెక్నిక్ లేదని విమర్శించాడు. పాక్ జట్టు పేపర్ మీద బలంగా కనిపిస్తోందని, మైదానంలో మాత్రం బలంగా కనిపించడం లేదని గంగూలీ విమర్శలు గుప్పించాడు.

తాము ఆడే రోజుల్లో పాకిస్తాన్ టీమ్ ఇలా ఉండేది కాదని, వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్, పటిష్ఠమైన బ్యాటింగ్ ఆర్డర్ తో బలంగా ఉండేదని అన్నాడు. ఈ తరహా పాక్ జట్టుతో తాము ఎప్పుడూ ఆడలేదని, ఒత్తిడిని ఆ జట్టు ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించాడు. ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్ లో పాక్ నెట్టుకు రావడం కష్టమేనని చెప్పాడు. ఇప్పటికే భారత్ పై ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ జట్టుపై గంగూలీ కామెంట్లు పుండు మీద కారం చల్లినట్లు ఉంది.