19వ ఏషియన్ గేమ్స్ లో తొలిసారిగా క్రికెట్ ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక, ఇదే జోరులో తాజాగా భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణ పతకం సాధించింది. వర్షం కారణంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫలితం రాకపోవడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు.
మెరుగైన ర్యాంక్ కారణంగా భారత జట్టును ఛాంపియన్ గా నిర్ణయించారు. శనివారం నాడు జరిగిన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆఫ్గాన్ జట్టు 18 ఓవర్లలో వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత వరుణుడు కరుణించకపోవడంతో మ్యాచ్ రద్దు చేసి భారత్ ను విజేతగా ప్రకటించారు.
ఏషియన్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టిన తొలి ఏడాది భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాయి. ఈ గోల్డ్ మెడల్ తో కలిపి మొత్తం 27 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. ఇప్పటివరకు మొత్తం 102 పతకాలను మన దేశపు క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. శనివారం ఉదయం ఆర్చరీ, మహిళ కబడ్డీలో భారత్ మూడు బంగారం పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, ప్రవీణ ఓజస్ బంగారు పతకాలను గెలుచుకున్నారు. చైనీస్ తైపీ జట్టును ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు బంగారం పతకం సొంతం చేసుకుంది. 100 మెడల్స్ కు పైగా సాధించి అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టుకు, క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates