ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నష్టపోయారు. అన్ని వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అపర కుబేరులన్న వారికి సైతం లక్షల కోట్ల రూపాయిల్లో నష్టం వాటిల్లింది. రోజుల వ్యవధిలో వారి షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి.
మొత్తంగా చూస్తే.. కరోనా ఎపిసోడ్ లో ప్రభావానికి గురి కాని రంగమే లేకుండా పోయింది. ఇలాంటివేళలోనూ కొందరు సుడిగాళ్లు ఉన్న విషయం సింగపూర్ కు చెందిన ఒక పారిశ్రామికవేత్తను చూస్తే అర్థమవుతుంది.
అందరిని ఆర్పేసిన కరోనా.. అందుకు భిన్నంగా ఇతగాడి సుడి మొత్తాన్ని మార్చేసింది. ఇంతకూ అతనే వ్యాపారం చేస్తాడన్న విషయంలోకి వెళితే.. లి జిటింగ్ కోసమే కరోనా వచ్చిందా? అన్న భావన కలుగక మానదు. షెంజెన్ మైండ్ రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న ఆయన పుట్టింది చైనాలోనే అయినా.. తర్వాతి కాలంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్ కు మార్చేశాడు. కరోనా పుణ్యమా అని అతగాడి కంపెనీ షేర్ ధరలు భారీగా పెరిగిపోయాయి.
ఎందుకంటే.. ఆయన కంపెనీ తయారు చేసేది వెంటిలేటర్లు.. వైద్య పరికరాలు. కరోనా వేళ.. వీటికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దీంతో.. ఆయన వ్యాపారం మూడు వెంటిలేటర్లు.. ఆరు వైద్య పరికరాలుగా మారిపోయింది. కరోనా ముందు వరకు ఆయన నికర సంపద విలువ రూ.32,777 కోట్లుగా ఉండేది. కరోనా పుణ్యమా అని ఆయన కంపెనీ షేరు విలువ అంతకంతకూ పెరిగిపోయింది.
దీంతో.. ఇప్పుడాయన నికర సంపద విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.02 లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది అతగాడు ప్రతి రోజు రూ.287 కోట్లు చొప్పున సంపాదించాడు. అంటే.. గంటకు రూ.12 కోట్లు అతడి సంపాదన. కరోనా వేళ.. ప్రపంచంలో అత్యంత వేగంగా సంపన్నుడిగా మారిపోయిన పారిశ్రామికవేత్త లి జిటింగే.
కరోనా పుణ్యమా అని షెంజెన్ మైండ్ రే కంపెనీకి వందకు పైగా దేశాల నుంచి వెంటిలేటర్లు.. వైద్య పరికరాల కోసం భారీగా ఆర్డర్లు వచ్చాయట. ఒక్క ఇటలీ నుంచే ఈ కంపెనీకి పదివేల వెంటిలేటర్ల ఆర్డర్ రావటం చూస్తే.. అతగాడి వ్యాపారం ఏం ధూంధాంగా మారిందో అర్థమైపోతుంది.