69 కేజీల బంగారం.. 336 కిలోల వెండి గణపతి

యావత్ దేశం చేసుకునే కొన్ని పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితికి గడిచిన కొంతకాలంగా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లు.. చివర్లో చేపట్టే నిమజ్జనానికి భారీ ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలో.. తమ శక్తి కొలదీ గణేషుడి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తుంటారు అయితే.. దేశంలోనే అత్యంత సంపన్న గణనాధుడి విగ్రహంగా ముంబయిలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుడి విగ్రహాన్ని చెబుతున్నారు.

కోట్లాది రూపాయిల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ గణేషుడి మండపాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ గణపతి మండపాన్ని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ మండలి ఏర్పాటు చేసింది. ఈ సంస్థను ఏర్పాటు చేసి 69 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో 69 కేజీల బంగారం.. 336 కేజీల వెండి ఆభరణాలతో గణేశ్ విగ్రహాన్ని అత్యంత ఆకర్షనీయంగా ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ఈ ఉత్సవాల సందర్భంగా రూ.360కోట్లకు భారీ బీమా పాలసీని తీసుకోవటం గమనార్హం. గత ఏడాది రూ.316 కోట్లకు పాలసీ తీసుకోగా.. ఈసారి మరింత ఎక్కువ మొత్తానికి పాలసీని తీసుకోవటం విశేషం. బీమాలో భాగంగా బంగారం.. వెండి.. ఇతర విలువైన వస్తువులకు రూ.31.97 కోట్ల కవరేజీ ఉంది. మిగిలిన మొత్తం మండపం.. నిర్వాహకులు.. భక్తుల భద్రతకు కేటాయించినట్లుగా చెబుతున్నారు.