ఇంటినుండే ఓటు

రాబోయే ఎన్నికల్లో ఇంటినుండే ఓట్లు, పనిచేసే ప్రాంతంనుండే వేసే ప్రయోగానికి తెలంగాణా వేదిక కాబోతోందా ? అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. ఇప్పటికే ఇలాంటి ఓటింగ్ ప్రక్రియను ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల కమీషన్, ఐటి తదితర శాఖల అధికారులు అమలుచేశారు. వాళ్ళ ప్రయోగం సక్సెస్ అయినట్లు తెలిసింది. ఇంటినుండి ఓట్లు వేసే అవకాశం అన్నది తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వచ్చిన ఆలోచన. తమ ఆలోచనకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి మొబైల్ సాంకేతికతతో ఒక ప్రత్యేకమైన యాప్ ను తయారుచేశారు.

ట్రయల్ రన్ గా ఖమ్మం జిల్లాలో డమ్మీ ఓటింగ్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. వివి ప్రయోగాల తర్వాత డమ్మీ పోలింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. డమ్మీ పోలింగ్ సందర్భంగా ఎదురైన సమస్యలను కూడా అధికారులు అధిగమించారు. తర్వాతే యాప్ కు ప్రత్యేక రూపునిచ్చారు. దివ్యాంగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది, వృద్ధులు, ఐటి ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, క్యూలైన్లలో ఉండి ఓటింగ్ చేయటాన్ని ఇష్టపడని అనేక వర్గాల వాళ్ళు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యాప్ ద్వారా ఓటు వేయాలని అనుకున్న ఎవరైనా సరే ఈ ప్రత్యేక యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి రెండు దశలున్నాయి. మొదటి దశలో ఓటర్లు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ఓటర్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ను ఫీడ్ చేయాలి.

పై వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫొటో దిగాల్సుంటుంది. లైవ్ ఫొటోను యాప్ నిర్ధారిస్తేనే యాప్ ద్వారా ఓటింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మరొకళ్ళు ఓటు వేయటానికి వీలులేని విదంగా ఆర్టిఫీషియర్ ఇంటెలిజెన్స్ తో యాప్ ను తయారుచేశారు. ఒకసారి యాప్ ద్వారా ఓటింగ్ చేసుకోవాలని అనుకుంటే తర్వాత ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసే అవకాశం ఉండదు. ఎన్ని ప్రయోగాలు చేసినా, డమ్మీ ఓటింగ్ నిర్వహించినా వాస్తవంగా ఎన్నికల్లో ఓట్లేసేటపుడు కూడా సడెన్ గా ఏదో సమస్యలు బయటపడే అవకాశాలున్నాయి. మరపుడు ఎన్నికల కమీషన్ ఏమిచేస్తుందో చూడాలి. ఏదేమైనా యాప్ ద్వారా ఓటింగ్ చేసే పద్దతి అమల్లోకి వస్తే మంచిదే కదా.