విశ్వనాథన్ ఆనంద్ కు 17 ఏళ్ల కుర్రాడి షాక్

భారతదేశంలో చెస్ పేరు చెప్పగానే వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. చెస్ లో భారత్ పేరు మార్మోగిపోయేలా చేసిన ఘనత ఈ గ్రాండ్ మాస్టర్ కే దక్కుతుంది. అందుకే 37 సంవత్సరాలుగా భారతదేశం తరఫున చెస్ లో విషి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తాజాగా ప్రపంచ చెస్ పోటీలలో తమ సత్తా చాటుతూ ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న యువ ఆటగాళ్లు విశ్వనాథ్ ఆనంద్ కు సవాల్ విసురుతున్నారు. ఇటీవలే చెన్నైకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానందా చెస్ ప్రపంచ కప్ లో రజత పథకం సాధించి చరిత్ర సృష్టించాడు.

ఇక తాజాగా చెన్నైకు చెందిన మరో ఆటగాడు 17 ఏళ్ల డి గుకేష్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా భారతదేశం తరఫున చెస్ లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న విశ్వనాథన్ ఆనంద్ ను గుకేష్ వెనక్కునెట్టాడు. తాజాగా విడుదల చేసిన ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో గుకేష్ 2758 పాయింట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఇక, ఆనంద్ 2754 పాయింట్లు తొమ్మిదో ర్యాంకు పడిపోయాడు. దీంతో మన దేశం తరఫున అగ్రస్థానంలో గుకేష్ కొనసాగుతున్నాడు.

5 సార్లు చెస్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఆనంద్ 1986 జూలై 1 నుంచి భారత నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ రికార్డును తాజాగా గుకేష్ బద్దలు కొట్టాడు. ఇటీవలి కాలంలో యువ ఆటగాళ్లు చెస్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. భారత నుంచి 80 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. త్వరలోనే ఈ సంఖ్య 100కు చేరుతుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.