కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు!

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు! అవును.. మీరు చ‌దివింది నిజ‌మే! ద్వార‌క ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కిలోమీట‌ర్‌కు రూ.250.77 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని కాగ్ (కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌) నివేదిక వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ- గురుగ్రామ్ మ‌ధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా క‌నిపిస్తోంద‌ని కాగ్ నివేదిక వ్యాఖ్యానించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో బీజేపీపై విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిప‌క్షాల‌కు ఓ ఆయుధం దొరికిన‌ట్ల‌యింది.

నిజానికి ఈ ర‌హ‌దారి నిర్మాణానికి ఒక్కో కిలోమీట‌ర్‌కు ప్ర‌భుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా.. వాస్త‌వ ఖ‌ర్చు మాత్రం రూ.250.77 కోట్ల‌కు పెరిగింద‌ని కాగ్ నివేదిక తెలిపింది. భార‌త్ మాల ప్రాజెక్టులో భాగంంగా ఈ 48వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిని 14 వ‌రుస‌లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమ‌తులిచ్చింది. 8 లేన్ల ఎలివేటెడ్ ద్వార‌క ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో సుల‌భంగా వాహ‌నాల రాక‌పోక‌ల కోసం త‌క్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెట్ట‌డ‌మే నిర్మాణ వ్య‌యం పెరిగేందుకు కార‌ణ‌మ‌ని రోడ్డు ర‌వాణా హైవేల శాఖ చెబుతోంద‌ని కాగ్ వెల్ల‌డించింది. ఈ కార‌ణం ఏ మాత్రం క‌రెక్టుగా లేద‌ని కాగ్ పేర్కొంది.

8 లేన్ల‌కు బ‌దులు ఆరు లేన్ల‌కు మాత్ర‌మే ప్ర‌ణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశార‌ని కాగ్ పేర్కొంది.  భార‌త్ మాల ప్రాజెక్టుల్లో భాగంగా దేశంలోని ఇత‌ర హైవేల నిర్మాణ కేటాయింపుల కంటే 58 శాతం అధికంగా ద్వార‌క ఎక్స్‌ప్రెస్ హైవే కేసం ఖ‌ర్చు చేశార‌ని కాగ్ తెలిపింది. దీంతో అధికార బీజేపీపై ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. రూ.6741 కోట్ల స్కామ్‌ను కాగ్ బ‌య‌ట‌పెట్టింద‌ని  ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సంచ‌ల‌న నివేదిక జాతీయ రాజ‌కీయాల‌ను మ‌రోసారి వేడెక్కించింద‌నే చెప్పాలి.