ఆస్తి కోసం భార్య‌ను చంపేశాడు.. ట్విస్ట్ ఏంటంటే!

దారుణాల‌కు అంతు పొంతు లేకుండా పోతోంది. కాటికి కాళ్లు చాపుకొన్న వ‌య‌సులోనూ.. ఆస్తుల‌పై మ‌మ‌కా రం పోవడం లేదు. సొంత వారినే కిరాత‌కంగా చంపేస్తున్నారు. పైగా ఉన్న‌త చ‌దువులు చ‌దివి.. స‌మాజంలో పేరున్న‌వారే ఇలాంటి దారుణాల‌కు దిగుతుండ‌డం మ‌రింతగా క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని బంద‌రు ప్రాంతంలో ఉన్న జవ్వాజి న‌గ‌ర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

ఆయ‌న పేరు లోక‌నాథ మ‌హేశ్వ‌ర‌రావు, వ‌య‌సు 70 ఏళ్ల‌కుపైగానే ఉంటాయి. ఆయ‌న భార్య రాధ‌. ఆమెకు 64 ఏళ్ల‌కు పైగానే ఉన్నాయి. ఇద్ద‌రూ కూడా ప్ర‌ముఖ వైద్యులు. ఒక‌రు ఎండీ, మ‌రొక‌రు ఎఫ్ ఆర్‌సీఎస్‌. ఇద్ద‌రూ కూడా ఇంట్లోనే కార్పొరేట్ త‌ర‌హా వైద్య శాల‌ను స్థాపించి 26 ఏళ్లుగా వైద్యం అందిస్తున్నారు. ఇద్ద‌రికీ ఒక్క‌డే కుమారుడు. అత‌ను కూడా డాక్ట‌రే. ఆయ‌న గుంటూరు జిల్లా పిడుగు రాళ్ల‌లో ఉంటారు. అయితే.. భారీగా పోగేసుకున్న ఆస్తిని త‌న వారికి ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని భార్య‌పై డాక్ట‌ర్ మ‌హేశ్వ‌ర‌రావు అనుమానం పెంచుకున్నారు.

అంతే!  ఈ వ‌య‌సులో ఆయ‌న‌కు ఆస్తిపై మ‌మ‌కారం పెరిగిపోయింది. ఇంకేముంది.. డ్రైవ‌ర్ సాయంతో అంత్యంత ప‌క్కాగా భార్య‌ను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. గ‌త నెల 25నే ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దిలాడు. డ్రైవ‌ర్ సాయంతో భార్య పెడ‌రెక్క‌లు విరిచిక‌ట్టి.. నోట్లో గుడ్డ‌లు కుక్కి.. ఆప‌రేష‌న్‌కు వినియోగించే క‌త్తితో పీక కోసేశాడు. త‌ర్వాత‌.. ఏమీ ఎరుగ‌న‌ట్టు కిందికి వ‌చ్చి.. వైద్య సేవ‌లు అందించారు. ఈ ఘ‌ట‌న సాయంత్రం 6-7.30 గంట‌ల మ‌ధ్య జ‌రిగింది.

అంద‌రూ వెళ్లిపోయాక‌.. ఏమీ ఎరుగ‌నట్టు పైకి వెళ్లి చూసి.. ఇంకేముంది.. భార్య‌ను ఎవ‌రో హత్య చేశారంటూ.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. చిత్రం ఏంటంటే..మ‌చిలీప‌ట్నం పోలీసుల‌కు కూడా ఏదైనా వైద్యం అవ‌స‌ర‌మైతే.. ఈయ‌న ద‌గ్గ‌రే చేయించుకుంటారు. దీంతో వారు హుటాహుటిన రంగంలోకి దిగి ప‌రిశీలించారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. జాగిలాలు నిందితుల‌ను గుర్తించ‌కుండా.. కారం పొడి చ‌ల్లేశారు స‌ద‌రు డాక్ట‌ర్‌.

అయితే.. కారం పొడి క‌వ‌ర్‌ను మాత్రం ప‌క్క‌నే ప‌డేశారు. ఇదే మొత్తం హ్య‌త‌ను ప‌ట్టించింది. ముందు డ్రైవ‌ర్‌ను త‌ర్వాత‌.. డాక్ట‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఘోరం వెలుగు చూసింది. ఉన్న ఆస్తిని త‌న త‌మ్ముడి కుమారుల‌కు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నందునే.. తాను చంపేశాన‌ని.. డాక్ట‌ర్ అంగీక‌రించ‌డం .. కొస‌మెరుపు.