మొబైల్స్ ను కంట్రోల్ చేయటం సాధ్యమేనా ?

ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక దరిద్రాలకు మొబైల్ ఫోనే చాలావరకు కారణం అనటంలో సందేహంలేదు. సమాజంలో హింస మితిమీరి పెరిగిపోతోంది. సెక్స్, అఘాయిత్యాలు, మహిళలపై దాడులు లాంటి అనేక సమస్యలకు మొబైల్ వాడకమే కారణమని పోలీసుల దర్యాప్తులో కూడా బయటపడుతోంది. ఈ సమస్య ఒక్క మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా అన్నీ దేశాల్లోను ఉంది. అందుకనే డ్రాగన్ ప్రభుత్వం ముందుగా మేల్కొనబోతోంది. ఎలాగంటే మొబైల్ ఫోన్ వాడకంపై నియంత్రణ విధించబోతోంది.

పిల్లలు, యువత విషయంలో ముందు చైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. గతంలో అంటే మొబైల్ ఫోన్లు లేనపుడు పిల్లలు, యువత, పెద్దలందరు హాయిగా ఎవరిపనులు వాళ్ళు చేసుకునేవారు. ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఎప్పుడైతే మొబైల్ ఫోన్లు ప్రవేశించాయో అప్పటినుండే సమస్యలు మొదలయ్యాయి. చైనాలో సెల్ ఫోన్, ల్యాపుటాపు ఉపయోగించే వాళ్ళ సంఖ్య ఎక్కువయిపోవటంతో పిల్లలు, యువతలో ఆనారోగ్యాలు పెరిగిపోతున్నాయని నిపుణులు మొత్తుకుంటున్నారు. పిల్లల ఆలోచనల్లో విపరీత పరిణామాలు, ఊబకాయం, మానసిక వికారాలు, ప్రాణంతాత గేములకు బానిసలవుతున్నట్లు గ్రహించారు.

అందుకనే నిపుణులు ఏమి సూచించారంటే మొబైల్ వాడకంపై వెంటన ఆంక్షలు పెట్టాలట. పిల్లలు, యువత మొబైల్ ఫోన్లో చూడాల్సినవి ఏమిటి ? ఎన్నిగంటలు చూడవచ్చు ? ఎకడెక్కడ మొబైల్ ఫోన్లు వాడలనే విషయమై డ్రాగన్ ప్రభుత్వం ఆంక్షలను రెడీచేస్తోందట. స్కూళ్ళు, కాలేజీల్లో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యిందట. అలాగే డేటా లిమిట్ చేయబోతోందట.

చైనాలో అయితే ఇవన్నీ సాధ్యమవుతాయనే అనుకోవాలి. కానీ మనదేశంలో ఇవన్నీ సాధ్యంకావు. ఎందుకంటే డ్రాగన్ దేశంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదంటే దాన్ని ప్రశ్నించేంత సీనుండదు. ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుందంటే ప్రతిఒక్కళ్ళు ఒప్పుకుని తీరాల్సిందే. కానీ మనదేశంలో అలాకాదు. ప్రతిదానికి కోర్టుల్లో కేసులువేస్తారు. కోర్టులు కూడా వెంటనే స్టేలు ఇచ్చేస్తాయి. సమ్మెలు, బందులు, ఆందోళనలు చేసే స్వేచ్చ మనదేశంలో చాలా ఎక్కువ. నిజానికి డ్రాగన్ దేశం ఆలోచిస్తున్నట్లే మొబైల్ ఫోన్ వాడకంపై ఆంక్షలు విధిస్తే మంచిదే కానీ అది మనదేశంలో సాధ్యమవుతుందా అన్నదే అసలు సమస్య.