ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మీ ఈఎంఐ తగ్గుతుందా?

దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి పడిపోతుంటే, మరోపక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు వడ్డీ రేట్లు పెంచుతారు లేదా అలాగే ఉంచుతారు. కానీ, ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాత్రం డేరింగ్ స్టెప్ వేస్తూ రెపో రేటును 0.25 శాతం తగ్గించి అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది.

ఈ నిర్ణయం వెనుక ఆర్‌బీఐకి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) రికార్డు స్థాయిలో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ధరల పెరుగుదల అదుపులో ఉంది కాబట్టి, ఇప్పుడు ఫోకస్ మొత్తం గ్రోత్ మీద పెట్టాలని ఆర్‌బీఐ డిసైడ్ అయ్యింది. అమెరికా 50 శాతం టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడింది. అందుకే గ్రోత్ రేటు అంచనాలను కూడా 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచారు.

సామాన్యులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. రెపో రేటు తగ్గితే బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే గృహ రుణాలు వాహన రుణాలు తీసుకున్న వారిపై ఈఎంఐ భారం తగ్గే ఛాన్స్ ఉంది. పండుగ సీజన్ తర్వాత మధ్యతరగతి జేబులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు ఎంత త్వరగా బదిలీ చేస్తాయో చూడాలి.

అయితే, ఇక్కడ ఒక చిన్న రిస్క్ కూడా ఉంది. ఇప్పటికే రూపాయి విలువ 90 దాటింది. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రూపాయి మరింత బలహీనపడే ప్రమాదం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. సిటీ గ్రూప్, ఎస్‌బీఐ వంటి సంస్థలు ఆర్‌బీఐ రేట్లు తగ్గించకపోవచ్చని అంచనా వేశాయి. కానీ ఆర్‌బీఐ మాత్రం రూపాయిని కాపాడటం కంటే, దేశం లోపల మనీ సర్క్యులేషన్ పెంచి గ్రోత్ రేట్ పెంచడానికే ఓటు వేసింది.

రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కూడా ఆర్‌బీఐ సిద్ధంగానే ఉంది. డిసెంబర్‌లో 5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ స్వాప్ చేయడానికి ప్లాన్ చేసింది. అలాగే మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయనుంది. మొత్తానికి రూపాయి రికార్డు లోలో ఉన్నా, భయపడకుండా గ్రోత్ కోసం ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.