ఫేస్‌బుక్ ప్రేమ‌.. ఏపీ కుర్రాడితో శ్రీలంక అమ్మాయి పెళ్లి

ఫేస్‌బుక్‌లో ప్రేమ‌.. పెళ్లి కోసం ఖండాలు దాట‌డం.. విదేశాల‌కు వెళ్ల‌డం.. ఇలాంటి వార్త‌లు ఇటీవ‌ల త‌ర‌చుగా చూస్తున్నాం. ప్రేమించిన వాళ్ల కోసం ఇత‌ర దేశాల‌కు వెళ్లి పెళ్లి చేసుకోవ‌డం.. అక్క‌డ ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘ‌ట‌నలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి కోసం శ్రీలంక యువ‌తి దేశం దాటి రావ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. ఈ ఇద్ద‌రిని ఫేస్‌బుక్ ప్రేమ క‌ల‌ప‌డం ఇక్క‌డ విశేషం.

చిత్తూరు జిల్లా వికోట‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ తాపీ మేస్త్రిగా ప‌ని చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఆయ‌న‌కు శ్రీలంక‌కు చెందిన యువ‌తి విఘ్నేశ్వ‌రి ప‌రిచ‌య‌మైంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చాలా కాలం పాటు మాట‌లు కొన‌సాగాయి. ఆ మాట‌లు దాటి ఇద్ద‌రి మ‌న‌సులు ప్రేమ‌తో క‌లిశాయి. దీంతో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఆమెను భార‌త్‌కు ర‌మ్మ‌ని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. దీంతో 20 రోజుల కింద‌ట వీకోట మండ‌లం ఆరిమాకుల‌ప‌ల్లికి విఘ్నేశ్వ‌రి చేరుకున్నారు. ల‌క్ష్మ‌ణ్ కుటుంబ స‌భ్యులు, గ్రామ పెద్ద‌లు వీళ్ల‌కు స్థానిక దేవాల‌యంలో పెళ్లి చేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు విఘ్నేశ్వ‌రికి వీసా స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. వీళ్ల పెళ్లి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు.. విఘ్నేశ్వ‌రిని చిత్తూరు ఎస్పీ కార్యాల‌యానికి పిలిచించి వివ‌రాలు తెలుసుకున్నారు. దీంతో టూరిస్ట్ వీసా కింద వ‌చ్చిన ఆమె వీసా గ‌డువు ఆగ‌స్టు 6తో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో గ‌డువు ముగిసేలోపు శ్రీలంక వెళ్లిపోవాల‌ని ఆమెకు సూచించారు. అంతేకాకుండా శ్రీలంక‌లోని ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఈ పెళ్లి గురించి స‌మాచారం అందించారు. చ‌ట్ట‌బ‌ద్ధంగా రిజ‌స్ట‌ర్ మ్యారేజీ చేసుకోవాల‌ని కూడా ఈ దంప‌తుల‌కు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె శ్రీలంక వెళ్తుందా? ఆమెను మ‌ళ్లీ ఇక్క‌డికి పంపించేందుకు త‌ల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. ఏదేమైనా మొత్తానికి ఇటీవ‌ల కాలంలో ఈ విదేశీ ప్రేమ‌, పెళ్లి ట్రెండు మాత్రం సాగుతోంది.