దేవుళ్ల విగ్రహాలు పాలు, నీళ్లు తాగుతున్నాయన్న వీడియోలు, వార్తలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదారాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో జరిగింది. చిన్న అనంతగిరిగా పేరు పొందిన శివాలయంలోని నందీశ్వరుడి విగ్రహం పాలు, నీళ్లు తాగుతుందనే విషయం వైరల్‌గా మారింది.
ఉదయం పూజలు చేసిన తర్వాత పూజారి ఆ విగ్రహానికి నీళ్లు తాగించారు. విగ్రహం మూతి దగ్గర స్పూన్ పెట్టగానే అందులోని నీళ్లు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. నంది విగ్రహానికి నీళ్లు తాగించేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీని వెనుక దేవుడి మహిమ ఉందని కొంతమంది అంటుండగా.. అలాంటిదేమీ లేదని సైన్సే కారణమని మరికొంత మంది వాదిస్తున్నారు.
ఇలాంటి పురాతన రాతి విగ్రహాల దగ్గర నీళ్లు పెడితే అవి పీల్చుకోవడం మామూలేనని మరికొంత మంది చెబుతున్నారు. కొన్ని విగ్రహాలకు నీళ్లను పీల్చుకునే శక్తి ఉంటుందని అంటున్నారు. మరి దీని వెనుక కారణమేదైనా భక్తులు మాత్రం ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్లోని కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఉన్న పురాతన మహాదేవి ఆలయంలోని నంది కూడా కొబ్బరి నీళ్లు, పాలు, మామూలు నీళ్లు తాగిందనే వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.