కలియుగం దైవం వెంకటేశ్వరుడంటే కోరిన కోర్కెలు తీర్చే దేవంగా ప్రశస్తి. అందుకే తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి దేశదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయాలు పలు ఇతర చోట్ల కూడా వాటివాటి మహాత్మ్యం కొద్దీ పేరుపొందాయి.
ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని వీసా బాలాజీ ఆలయం కూడా అంతే. అలాగే.. కోనసీమ జిల్లా వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తుల నుంచి అలాంటి గుర్తింపే వస్తోంది. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఏడు శనివారాలు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని అంటారు. అందుకే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి గత ఆరు వారాలుగా వాడపల్లి ఆలయానికి వస్తున్నారు.
అయితే… మామూలుగా ఎందరో వచ్చి వెళ్తుంటారు కానీ ఈ భక్తుడు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈయన బెంగళూరు నుంచి రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి సొంత విమానంలో వచ్చి అక్కడి నుంచి కారులో వాడపల్లి వెళ్లి దర్శించుకుంటున్నారు. ఇప్పటికి ఆరువారాలుగా వస్తున్న ఆయన ఆలయానికి రూ. కోటి విరాళం కూడా ఇచ్చారట.
వాడపల్లి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఏడు శనివారాలు ఈ ఆలయంలో వెంకన్నను దర్శించుకుని 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న నమ్మకం ఉండడంతో శనివారాలు ఈ ఆలయానిక భక్తులు పోటెత్తుతుంటారు. ఈ ఆలయంలో గోదాదేవి కల్యాణం జరిపిస్తే అవివాహితులకు పెళ్లవుతుందన్న నమ్మకం కూడా ఉంది. రావులపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఉంటుంది. రావులపాలేనికి రాజమండ్రి సహా అనేక ఇతర ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates