H-1B వీసాలపై కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇచ్చే H-1B వీసా ఉంటే కెనడాలోనూ పనిచేసే విధంగా ఇక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 10 వేల మంది అమెరికా H-1B వీసా కలిగిన వారిని కెనడాలో పనిచేసేందుకు వీలు కల్పిస్తున్నట్టు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓపెన్ వర్క్-పర్మిట్ విధానాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఫలితంగా H-1B వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులకు స్టడీ, వర్క్ పర్మిట్‌లను కూడా అనుమతించనున్నట్టు వివరించారు.
కెనడా, అమెరికా రెండు దేశాల్లోనూ ప్రఖ్యాత కంపెనీల ద్వారా హైటెక్ రంగాలలో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో చాలా మంది H-1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాలు కలిగి ఉన్నారు. అమెరికాలో H-1B వీసా ఉన్నవారు.. ఈ ఏడాది జూలై 16 నుండి కెనడాకు వచ్చి పని చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు మంత్రి వివరించారు.
ఈ కొత్త కార్యక్రమం కింద దరఖాస్తుదారులకు మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే ఓపెన్ వర్క్ పర్మిట్‌ను ఇస్తారు. వీరంతా కెనడాలో ఎక్కడైనా పని చేసేందుకు అనుమతిస్తారు. అదేసమయంలో వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన వారు కూడా తాత్కాలిక నివాస వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని మంత్రి చెప్పారు.
ఈ సంవత్సరం చివరి నాటికి, కెనడాలోని ఫెడరల్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు మంత్రి ఫ్రేజర్ తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను టెక్ కంపెనీలకు వచ్చి పని చేయడానికి వీలు కల్పిస్తుంది. కెనడాలో వారికి జాబ్ ఆఫర్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా అవకాశం కల్పించడం విశేషం. అయితే, నిర్దిష్ట అర్హత ప్రమాణాలు, వ్యక్తుల సంఖ్య వంటివి మాత్రం ప్రస్తుతానికి ప్రకటించలేదు.
H-1B వీసాలున్న విదేశీ పౌరులను అమెరికాలో ప్రత్యేక వృత్తులు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో తాత్కాలికంగా పని చేయడానికి అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టెక్ కంపెనీలు తమ నియామకాలను పెంచాయి. అదేసమయంలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. పర్యవసానంగా, చాలా మంది H-1B వీసా హోల్డర్లు కొత్త ఉద్యోగ అవకాశాలను కోరుతున్నారు.ఈ నేపథ్యంలో వారి సేవలను వినియోగించుకునేందుకు వీలుగా కెనడా సంచలన నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.