21 డేస్.. పిచ్చిపిచ్చిగా వాడుకోండి మరి

కరోనా వైరస్ కారణంగా అందరికీ 21 రోజుల హాలీడేస్ వచ్చేశాయి. ఉదయాన్నే లేచి ఆఫీసుకి లేట్ అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్‌లో అవస్థలు, స్కూళ్లు, కాలేజీల్లో పరీక్షల పరేషాన్… ఇలా ఏ కష్టాలు లేవు. ఈ 21 రోజులు బుద్ధిగా ఇంట్లో ఉంటే చాలు. మరి 21 రోజులు ఇంట్లో ఏం చేయాలి? అన్నిరోజులంటే కాలక్షేపం ఎలా అవుతుంది? అనుకునేవారికి ఓ జపనీస్ ఫార్మూలా!

ఏదైనా కొత్త అలవాటు నేర్చుకోవాలన్నా, ఉన్న అలవాటును వదిలించుకోవాలన్నా 21 రోజులు పడుతుందని జపనీయుల నమ్మకం. పైగా దానిని చాలాసార్లు వాళ్ళు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు. కాబట్టి సిగరెట్, మద్యం వంటి అలవాట్లను మానేయాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నవారికి ఇది ఓ అద్భుతమైన అవకాశం. ఇంట్లోనే ఉంటారు కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే లాక్ డౌన్ ముగిసేలోపు ఈ వ్యసనాల నుంచి బయటపడొచ్చు. ఎలాగో మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి… కాబట్టి దొంగ మార్గాల్లో మద్యం కొనాలనే ఆలోచనను మానుకుంటే సరిపోతుంది.

చాలామంది యువకులు ఇంట్లోవాళ్లకి తెలియకుండా దమ్ము కొట్టేవాళ్లే! కాబట్టి ఈ 21 రోజుల పాటు దానికి దూరంగా ఉంటే, ఆ తర్వాత ఈజీగా మానేయొచ్చు. అలాగే చిన్నప్పుడు పెయింటింగ్, డ్రాయింగ్, డిజైనింగ్, కథలు, కవిత్వాలు… వంటి ఎన్నో కళలంటే ఆసక్తి ఉండేవి. ఆ కళలను ఈ టైమ్‌లో మళ్లీ బయటికి తీయండి. అలాగే ఎన్నో రోజులుగా సర్దుదామనుకుని టైమ్ లేక వదిలేసిన రూమ్‌ను క్లీన్ చేసేయండి. ఆసక్తి ఉంటే యూట్యూబ్‌లో చూస్తూ కొత్త కోర్సులు నేర్చుకోవడం, యోగా చేయడం, కొత్త వంటకాలు ప్రయత్నించండి, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం వంటివెన్నో చేసేయొచ్చు.

దొరక్క దొరక్క దొరికిన ఈ అద్భుత అవకాశం మళ్లీ భవిష్యత్తులో దొరక్కపోవచ్చు… కాబట్టి ఈ 21 రోజులను పక్కాగా వాడుకుని ఇంట్లోనే ఉండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి.