అమెరికాలో దీపావ‌ళి సెలువు.. ఎప్పటి నుంచంటే

దీపావ‌ళి, ద‌స‌రా, సంక్రాంతి వంటివి కేవ‌లం భార‌తీయుల‌కు సంబంధించిన పర్వ‌దినాలు. ఆయా రోజుల్లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. ప్రైవేటు సంస్థ‌లు కూడా సెల‌వులు ప్ర‌క‌టిస్తాయి. ఇక విద్యాసంస్థ‌ల‌కు పూర్తి కాలం సెల‌వు ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్పుడు అగ్ర‌రాజ్యం అమెరికా కూడా ఈ జాబితాలో చేరు తోంది. ఏటా దీపావ‌ళి రోజు సెలవు ప్ర‌క‌టించ‌నుంది. దివ్వెల‌ పండగను సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ చట్టసభ్యురాలు గ్రేస్డ్‌ మెంగ్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు.

 ‘దీపావళి డే యాక్ట్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించా యి. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దీపావళి చాలా ముఖ్యమైన రోజు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను నిర్వహించడం విశేషం. న్యూయార్క్‌లోని క్వీన్స్‌ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. దీపావళిని ఫెడరల్‌ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడకలు చేసుకునేందుకు వీలుంటుంది’’ అని బిల్లులో పేర్కొన్నారు.

ఈ బిల్లు కాంగ్రెస్‌ లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు లభిస్తుంది. అది జరిగితే, అమెరికాలో ఫెడరల్‌ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలవనుంది. ఈ బిల్లును భారత సంతతి చట్టసభ్యులు, పలు కమ్యూనిటీల నేతలు స్వాగతిస్తున్నారు. కాగా.. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ 2021లోనూ యూఎస్‌ కాంగ్రెస్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా.. పలు కారణాలతో అది వీగిపోయింది.