ఆలోచన మార్చుకుంటున్న కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల ఘన విజయం తాలూకు ఉత్సాహం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే తొందరలోనే నాన్ ఎన్డీయే పార్టీల సమావేశానికి రెడీ అవుతోంది. ఇందుకోసం వేదికను, తేదీని సిద్ధం చేయడానికి అవసరమైన చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు చర్చించారు. వేదిక, తేదీ మరో రెండురోజుల్లో ఫైనల్ కావచ్చని అనుకుంటున్నారు.

వేదికయితే బీహార్ రాజధాని పాట్నాలోనే ఉండచ్చని సమాచారం. ఎందుకంటే పాట్నాలో ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించేందుకు నితీష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వేదిక ఫిక్సయినట్లే. ఇక నిర్ణయమవ్వాల్సింది తేదీ మాత్రమే. అలాగే నాన్ ఎన్డీయే పార్టీలంటే ఎవరెవరిని పిలవాలనే విషయాన్ని కూడా ఫైనల్ చేయబోతున్నారు. పిలవాల్సిన వాళ్ళెవరు అన్నది తేలిపోతే డేట్ కూడా ఆటోమేటిగ్గా ఫైనల్ అయిపోయినట్లే అని నితీష్ చెబుతున్నారు.

2024 ఎన్నికల్లో నాన్ ఎన్డీయే పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ ఉండాలన్నది స్థూలంగా అందరు అనుకుంటున్నారు. అయితే దీనికి ఒక రూపమంటూ ఇవ్వలేదు. ఇదివరకే నితీష్ తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనొకటి కీలకంగా మారింది. అదేమిటంటే వన్ ఆన్ వన్ అన్నది ఈ సూత్రం. వన్ ఆన్ వన్ అంటే ఎన్డీయే తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులపై ప్రతిపక్షాల తరపున కేవలం ఒక అభ్యర్థి మాత్రమే పోటీచేయాలి.

అంటే ప్రతిపక్షాల తరపున పోటీ చేయబోయే అభ్యర్ధే ఉమ్మడి అభ్యర్ధవుతారు. సదరు అభ్యర్ధి గెలుపుకు ప్రతిపక్షాలన్నీ కష్టపడి పనిచేస్తే గెలుపు సాధ్యమే అన్నది నితీష్, మమత ఆలోచన. ఆలోచన వరకు కరెక్టే అనిపిస్తోంది. కానీ ఆచరణలో సాధ్యమవుతుందా అన్నదే అనుమానం. వీళ్ళ సూచన ప్రకారం ఏ రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలు బలంగా ఉంటే ఆ పార్టీలే ఎక్కువ సీట్లలో పోటీచేస్తాయి. అంటే కాంగ్రెస్ పోటీచేయబోయే సీట్ల సంఖ్య తక్కువైపోతుంది. పోటీచేసే సీట్లే తక్కువైపోతే ఇక గెలిచే సీట్లెన్ని ? అన్నదే అసలు సమస్య. ఒకవేళ ఈ సూత్రం వర్కవుటై అధికారంలోకి వచ్చేట్లయితే ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎవరుంటారో తేల్చే విషయంలో కాంగ్రెస్ వాయిస్ తగ్గిపోతుంది. మరి దీనికి కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ?