పార్టీ ఆఫీసులో నేతలతో మాట్లాడిన సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రకటించారు. ఈ ప్రకటన జనసేన నేతల్లో ఉత్సహాన్ని నింపింది. అయితే ఇదే సమయంలో తమ్ముళ్ళను కలవరపాటుకు గురిచేసింది. టీడీపీ, జనసేన పొత్తుంటుందని మాత్రమే పవన్ చెప్పలేదు. బీజేపీని కూడా ఒప్పించి పొత్తులోకి తీసుకొస్తానని గట్టిగా చెప్పారు. దీంతో తమ్ముళ్ళల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఎందుకంటే తమకు బలమున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీచేస్తామని పవన్ చేసిన ప్రకటనే టీడీపీ నేతల్లో టెన్షన్ కు కారణమైంది.
పవన్ లెక్కప్రకారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు పార్టీకి మంచి పట్టుందట. ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం ఓటు బ్యాంకు ఉందట. అలాగే కృష్ణా జిల్లా నుండి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలోను 25 శాతం ఓటుబ్యాంకు ఉందన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాలను కూడా కలుపుకుంటే సగటును 18 శాతం ఓటుబ్యాంకుందని చెప్పారు. 2019లో వచ్చిన 7 శాతం ఓటుబ్యాంకుతో పోల్చుకుంటే ఇపుడు తమ పార్టీ ఓటుబ్యాంకు బాగా పెరిగిందన్నారు.
అంటే ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం ఓటుబ్యాంకుందని చెబుతున్న పవన్ రాబోయే ఎన్నికల్లో మినిమం 10 సీట్లలో పోటీచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో మరో 8 సీట్లు, రాయలసీమలోని 52 సీట్లలో 10, కోస్తా జిల్లాల్లోని నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మరో 10 సీట్లలో పోటీచేయచ్చని అంచనా వేశారని సమాచారం. అంటే హోలు మొత్తంమీద 45 సీట్లలో జనసేన పోటీచేయబోతున్నట్లు పవన్ హింట్ ఇచ్చారు. కాకపోతే సీట్ల సంఖ్యలో కాకుండా ఓట్ల శాతం ద్వారా చెప్పారు.
ఇక బీజేపీ కూడా పొత్తులో ఉంటే దానికి మరో 15 సీట్లు వదులుకోక తప్పదు. అంటే పొత్తుల్లో టీడీపీ సుమారు 60 నియోజకవర్గాలను కోల్పోక తప్పదు. టీడీపీ కోల్పోయే ఆ 60 నియోజకవర్గాలు ఏవి అన్న విషయం అర్ధంకాక తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అయినా పవన్ అడిగనన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా అనేది కూడా అనుమానమే. ఏదేమైనా జనసేన, బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సీట్ల కేటాయింపులో కాస్త ఉదారంగా ఉండక తప్పేట్లులేదు. అందుకనే తమ్ముళ్ళల్లో పొత్తుల టెన్షన్ పెరిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates