చైనాలో తొలి చాట్ జీపీటీ అరెస్టు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (కృత్రిమ మేధ) ఆటం బాంబ్ కంటే ప్రమాదకరమైనదంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. అందుకు తగ్గట్లే చోటు చేసుకున్న ఈ పరిణామం చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని విపరిణామాలు చోటు చేసుకుంటాయన్న భావన కలుగక మానదు. మానవ మేధస్సును మించిపోయే ఈ కృత్రిమ మేధతో బోలెడన్ని అరాచకాలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళలోనే.. కృత్రిమ మేధతో సిద్ధం చేసిన చాట్ జీపీటీ సాయంతో క్రియేట్ చేసిన ఒక వార్త చైనాలో పలువురిని పక్కదారి పట్టించింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఒక రైలు ప్రమాదం జరిగిందని.. తొమ్మిది మంది చనిపోయినట్లుగా ఒక ఫేక్ వార్తను క్రియేట్ చేశారు. అది కూడా చాట్ జీపీటీ సాయంతో. అనంతరం ఆ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చి పలువురిని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. చైనాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై పోలీసులు రియాక్టు అయ్యారు. ఈ తప్పుడు పనికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

వాయువ్య గాన్సు ప్రావిన్స్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హాంగ్ అనే మారు పేరుతో నిందితుడు తప్పుడు వార్తను క్రియేట్ చేసినట్లుగా గుర్తించారు. చైనాలో చాట్ జీపీటీని దుర్వినియోగపరుస్తూ జరిగిన తొలి అరెస్టు ఇదేనని చెబుతున్నారు. ఇతగాడు క్రియేట్ చేసిన తప్పుడు వార్తను నిజమేనని నమ్మి.. కొన్నిమీడియా సంస్థలు ఈ వార్తను పబ్లిష్ చేయటం గమనార్హం. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తను క్రియేట్ చేసిన వ్యక్తిని చైనా పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో చాట్ జీపీటీని తప్పుడు మార్గాల్లో వినియోగించటం ద్వారా జరిగే నష్టాలు ఎంత భారీగా ఉంటాయన్న ఆందోళన కలుగక మానదు.