ఐపీఎల్‌లో ఒక బౌలర్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ రెండూ బౌల్డ్‌లే. ఐతే అతను బౌల్డ్ చేసినందుకు బీసీసీఐ రూ.60 లక్షలు నష్టపోవడం గమనార్హం. ఇదేం లాజిక్? ఇందులో బెట్టింగ్, ఫిక్సింగ్ వ్యవహారం ఏమైనా ఉందా? అని ఆశ్చర్యం కలుగుతోందా? అలాంటిదేమీ లేదు.
ఆ బౌలర్ బౌల్డ్ చేసిన రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ రెండుగా విరిగిపోవడం విశేషం. ఆ విరిగిన స్టంప్ ఆషామాషీది కాదు. ఒక్కో స్టంప్ ఏకంగా రూ.30 లక్షలు ఖరీదు చేసేది. రెండు స్టంప్‌లు విరగడంతో బీసీసీఐకి రూ.60 లక్షల నష్టం తప్పలేదు. ఇది జరిగింది శనివారం రాత్రి ముంబయి-పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఏకంగా 214 పరుగుల స్కోరు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి కూడా దీటుగానే స్పందించింది. కానీ చివరికి 6 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమి పాలైంది.
గెలుపు బాటలో సాగుతున్న ముంబయికి కళ్లెం వేసింది పంజాబీ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. చివరి ఓవర్లో ముంబయి విజయానికి 16 పరుగులు అవసరమైన స్థితిలో అతను కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో 3, 4 బంతులకు తిలక్ వర్మ, వధేరాల వికెట్లు తీశాడతను. అర్ష్‌దీప్ ధాటికి రెండు సార్లూ మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. అతడి బంతుల వేగం ఏ స్థాయిలో ఉందంటే.. రెండుసార్లూ స్టంప్ రెండుగా విరిగిపోయింది. ఇవి ఆషామాషీ స్టంప్స్ కావు.
మైక్, కెమెరాతో పాటు ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉన్న అధునాతన టెక్నాలజీతో తయారు చేసినవి. ఒక్కో స్టంప్ ధర ఏకంగా రూ.30 లక్షలట. అర్ష్‌దీప్ వల్ల రెండు స్టంప్‌లు పాడైపోవడంతో బీసీసీఐకి రూ.60 లక్షల నష్టం వచ్చింది. నిన్న రాత్రి నుంచి ఈ విషయంలో ట్రెండింగ్‌లో ఉంది. అర్ష్‌దీప్ బౌల్డ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఐపీఎల్ ద్వారా వెలుుగలోకి వచ్చిన ఆణిముత్యాల్లో అర్ష్‌దీప్ ఒకడు. అతను ఇండియన్ టీంకు కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే.