హైదరాబాద్ లో ఐటీ కంపెనీ అరాచకం

ఇదో ఘరానా మోసం. విన్నంతనే అర్థం కాదు. కాస్తంత వివరంగా చెబితే.. అసలు విషయం అర్థమై ఆశ్చర్యపోవటమే కాదు.. వామ్మో ఇలా కూడా మోసం చేస్తారా? అంటూ నోరెళ్లబెట్టే పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో ఐటీ కంపెనీల పేరుతో జరిగే మోసాలకు సంబంధించి ఇదో కొత్త తరహా మోసంగా చెప్పాలి. ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంపెనీల మాటునే.. దొంగ పనులు చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి. ఆ కోవలోకే వస్తుందీ ఉదంతం.

హైదరాబాద్ ఐటీ జోన్ లో (గచ్చిబౌలి) ఇన్సోఫీ అనే ఐటీ కంపెనీ ఒకటి ఉంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఐటీ కంపెనీ జాబ్ ఓపెనింగ్స్ అంటూ అందరినీ ఆకర్షించింది. క్యాంపస్ సెలక్షన్లు అంటూ.. బీటెక్ పూర్తి చేసిన వారికి రూ.6.2 లక్షలు.. డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ.5.2లక్షల చొప్పున ఆఫర్ లెటర్లు ఇచ్చింది. డేటా సైన్స్ లో తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం తమ సంస్థలోనే ఉద్యోగాలు ఇస్తామని ఊరించింది. అయితే.. ఇందుకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పి.. రూ.4 లక్షలకు పైగా చెల్లించాలని చెప్పింది.

అంత ఫీజు కట్టటం కష్టమని చెబుతూ.. మీకెలాంటి ఇబ్బంది ఉండదంటూ.. ఉద్యోగుల పేరుతోబ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంది. అలా తీసుకున్న రుణాన్ని నెలవారీగా వాయిదాల రూపంలో తీర్చేస్తామని నమ్మబలికింది. వారి మాటల్ని నమ్మిన ఉద్యోగులు వారు చెప్పిన చోట సంతకాలు చేశారు. ఇలా మొత్తం 700 మంది ఉద్యోగుల్లో 650 మంది పేరుతోఒక ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.4 లక్షల చొప్పున రూ.26 కోట్ల రుణాన్ని సదరు కంపెనీ తీసుకుంది. మరో 50 మంది పేరు మీద రూ.10లక్షలు చొప్పున రూ.5 కోట్ల భారీ మొత్తాన్ని రుణంగా తీసుకుంది. మొత్తంగా ఉద్యోగుల నుంచి రూ.31 కోట్లు వసూలు చేసిన కంపెనీ .. ఏడాదిన్నర నుంచి ఉద్యోగులకు ఒక్కపైసా కూడా ఇవ్వకుండా ఉండిపోయింది.

జీతం గురించి ఉద్యోగులు అడిగితే.. ప్రాజెక్టులు లేవని చెప్పింది. కొందరు గట్టిగా ప్రశ్నిస్తే.. మీ పని తీరు బాగోలేదని చెప్పింది. తాజాగా 700 మందినీ కంపెనీ నుంచి తొలగించినట్లుగా ఈమొయిల్ చేయటంతో ఉద్యోగులు తాము మోసపోయినట్లుగా గుర్తించారు. సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఒకవైపు జీతం లేక.. మరోవైపుతమ పేరు మీద బ్యాంకులో అప్పు తీసుకున్న వైనంపై వారు గళం విప్పారు. తమకు న్యాయం చేయాలంటూఆందోళనకు దిగారు.

కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న దక్షిణామూర్తి.. గతంలో డిఫెన్సు సంస్థల్లో పని చేసినట్లు చెబుతున్నారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో తొలుత వారిపై బెదిరింపులకు దిగిన సంస్థ.. ఆ తర్వాత తీవ్రత తెలుసుకొని కాస్త వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. మొదట దురుసుగా కోర్టులో చూసుకుందామని చెప్పి.. తాజాగా మాత్రం తాము ఇష్యూను సెటిల్ చేస్తామని రాజీ చర్యలకు దిగినట్లుగా చెబుతున్నారు. అందరి పేర్ల మీద తీసుకున్న లోన్లు తీర్చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆందోళన చేపట్టిన వేళలో.. తాము కోర్టుకు వెళతామని కొందరు ఉద్యోగులు చెబితే.. తాము ఐపీ పెడతామని చెప్పినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా కంపెనీ తీరును పలువురు తప్పు పడుతున్నారు. కంపెనీలో ఉద్యోగం వచ్చిందన్న వెంటనే.. వారు చెప్పినట్లుగా చేసే కన్నా కాస్త వెనుకా ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఇదే తరహాలో మోసపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.