డీఏవీ స్కూల్ ఘ‌ట‌న‌: డ్రైవ‌ర్‌కు 20 ఏళ్ల జైలు

ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఉన్మాదికి కోర్టు స‌రైన శిక్ష విధించింది. 20 ఏళ్ల‌పాటు జైలు శిక్ష విధిస్తూ.. సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న‌ డీఏవీ స్కూల్లో జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న‌పై నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ పాల్ప‌డిన దాష్టీకాన్ని నిర్దారిస్తూ.. 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది.

ఏం జ‌రిగింది?
రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఉలిక్కిప‌డేలా చేసిన ఉన్నాద చ‌ర్చ గతేడాది అక్టోబర్‌లో జ‌రిగింది. డీఏవీ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై డ్రైవర్ రజనీకుమార్ లైంగిక దాడులకు పాల్పడినట్టు వెలుగు చూడ‌డం సంచలనం సృష్టించింది. నాలుగేళ్ల బాలికపై రజనీకుమార్ పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నించగా.. ప్రిన్సిపాల్ మాధవి.. తన డ్రైవర్‌‌ను కాపాడేందుకు అనేక మార్లు ప్రయత్నించిం ది. దీంతో ప్రిన్సిపాల్‌పై బాలిక తల్లి దండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై చిన్నారి తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. దీంతో అక్టోబర్ 19న రజనీకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించి సాక్ష్యాధారాలను బంజారాహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. డ్రైవర్ రజనీకుమార్‌కు దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న ప్రిన్సిపాల్ మాధవిని మాత్రం కోర్టు నిర్దోషిగా తేల్చింది.