బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా సౌరభ్ గంగూలీ తనకు వ్యతిరేకంగా వ్యవహరించాడని చాలా బలంగా నమ్ముతాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. తనను వన్డే కెప్టెన్‌గా తప్పించడంలో గంగూలీదే కీలక పాత్ర అన్నది అతడి నమ్మకం. ఈ విషయాన్ని విలేకరుల ముందు కూడా పరోక్షంగా చెప్పాడు ఓ సందర్భంలో. గంగూలీ వచ్చాకే భారత క్రికెట్లో కోహ్లి ఆధిపత్యానికి తెరపడిందని.. సెలక్షన్ సహా అన్ని నిర్ణయాల్లో విరాట్ ఏకఛత్రాధిపత్యాన్ని అతను తగ్గించాడని అంటారు.
కారణాలు ఏవైనా సరే.. గంగూలీతో విరాట్‌కు సరైన సంబంధాలు లేవన్నది మాత్రం స్పష్టం. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడరు. కోహ్లి అయితే ఈ విషయంలో మరింత పట్టుదలగా కనిపిస్తాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా దిగిపోయాక కూడా పరిస్థితి మారలేదని స్పష్టమవుతోంది.
శనివారం ఐపీఎల్‌లో బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా వీరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టోర్నీలో గంగూలీ ఢిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఢిల్లీ ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో కలిసి గంగూలీ మైదానంలోకి వచ్చాడు. ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది కరచాలనం చేసుకునే సమయంలో కోహ్లి.. గంగూలీ దగ్గరికి రాగానే పట్టించుకోనట్లు ఉన్నాడు. ఢిల్లీ కోచ్ పాంటింగ్‌ను చూస్తూ అతడితో మాట్లాడుతూ ఉండిపోయాడు.
గంగూలీ కూడా విరాట్ వైపు చూడకుండా అతణ్ని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతకుముందు మ్యాచ్‌లో ఢిల్లీ డగౌట్‌కు దగ్గరగా విరాట్ ఫీల్డింగ్ చేస్తుండగా.. సమీపంలో గంగూలీ ఉన్నా అతడి వైపు కోహ్లి చూడలేదు. గంగూలీ కూడా అతణ్ని పట్టించుకోనట్లు ఉండిపోయాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద అగాథమే ఏర్పడిందని అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates