పెళైన ఏడాదికే విడిపోతున్నారు

నా ప్రేమ న‌వ‌పారిజాతం.. అని ఎంతో తీయ‌గా క‌మ్మ‌ని పాట మొద‌లు పెట్టిన జంట‌లు.. పాట పూర్త‌య్యే లోపే.. వాడిపోతున్నాయి! ప్రేమ‌కోసం ప్రాణ‌మైనా ఇస్తా అనే మాట‌లు.. కొన్నాళ్లకే ప‌రిమితం అయిపోతు న్నాయి!! మ‌రికొన్నాళ్లకే ప్రేమ‌లేద‌ని.. ప్రేమించ‌రాద‌నే విషాద గీతాలే ఈ జంట‌ల జీవితాను ప్ర‌భావితం చేస్తున్నాయి!! మ‌రి దీనికి కార‌ణం.. ఏంటి? ఎందుకు? అంటే.. దాగుడు మూత‌లేన‌ని తేల్చి చెబుతున్నా రు ప‌రిశోధ‌కులు.

నాకు నువ్వు-నీకు నేను.. అని చేతులు క‌లిపే బంధం.. తొలినాళ్ల‌లో యువ‌తీయువ‌కుల మ‌ధ్య ఆక‌ర్ష‌ణ పేరుతో కొన్ని విష‌యాల‌ను దాచిపెడుతున్నార‌ని.. ఫ‌లితంగా ఏడాది త‌ర్వాత‌.. ఆయా విష‌యాలు బ‌య‌ట‌ప‌డి.. అవి ప్రేమలు విఫ‌ల‌మ‌వడానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 75 శాతం ప్రేమ‌లు తొలి ఏడాదిలోనే విఫ‌లం కావ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు.

మ‌న దేశంలో ప‌రిస్థితి కొంత న‌య‌మేన‌ని అంటున్నారు. అదే అమెరికా, యూరప్‌ దేశాల్లో 75 శాతం ప్రేమ జంటలు కేవ‌లం ఏడాది కాలంలోనే.. విడిపోతున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. మ‌రికొన్ని కేసుల్లో అంటే.. 20 నుంచి 25 శాతం మంది మాత్రమే తమ ప్రేమను నాలుగైదేళ్ల పాటు కాపాడుకుంటు న్నారట‌. ఇక‌, పదేళ్ల పాటు కలిసున్న విదేశీ జంటలు చాలా అరుదేన‌ని తేల్చేస్తున్నారు.

ఇదీ.. కార‌ణం..

ఎంతో ఇష్ట‌ప‌డి.. ఎద‌రు చూసి.. ప్రేమించుకున్న జంట‌లు ఎందుకు విడిపోయాయ‌నే విష‌యంపై స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ సోషియాలజిస్ట్‌ మైఖేల్‌ రోసెన్‌ఫెల్డ్, మానసిక చికిత్స నిపుణుడు డాక్టర్‌ బార్టన్‌ గ్లాడ్‌స్మిత్‌లు అధ్యయనం చేశారు. వీరు 2009 నుంచి 2022 వరకు దాదాపు 3000 జంటలపై చేసిన పరిశోధనల్లో విడిపోయేందుకు కీలకంగా మారిన అంశం దాగుడు మూత‌లేన‌ని తేల్చి చెప్పారు.

తొలినాళ్ల‌లో త‌న‌ను ప్రేమిస్తే.. చాలు అనుకుని.. యువ‌తి, యువ‌కులు భావిస్తారు. దీంతో కొన్ని కొన్ని విష‌యాలు ఇరు ప‌క్షాలు దాస్తాయి. దీంతో వ్య‌తిరేక ప్ర‌వ‌ర్త‌న పెద్ద‌గా బ‌య‌ట ప‌డ‌దు. కానీ, రోజులు గ‌డిచే కొద్దీ.. వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన లేదా వ్యక్తిత్వాన్ని లోతుగా అంచనా వేస్తారు. ఏడాది గడిచాక దాచిపెట్టిన వ్యక్తిత్వం బయటపడుతుంది.. ఆ సమయంలోనే విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్ర‌ధానంగా పాత ప్రవర్తనలు, ప్రేమ‌లు, ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం వంటివి ఎదుటి వారికి ఇబ్బందిగా మారడం.. వాటిని మానుకోమని చెప్పడంతో మొదలయ్యే ఘర్షణ బ్రేకప్‌కు దారితీస్తుందని గుర్తించారు.

విడిపోవ‌డ‌మూ ప్ర‌త్యేకంగానే!
ప్రేమికులు విడిపోయేందుకు కూడా ప్ర‌త్య‌క రోజులు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ప్రేమికుల రోజు, వసంతకాలం, ఏప్రిల్‌ ఫూల్స్‌ డే, వేసవి సెలవులు, క్రిస్మస్, క్రిస్మస్‌ రోజుకు రెండు వారాల ముందు, సోమవారాల్లో బ్రేకప్‌లు తరచుగా జరుగుతున్నాయని శాస్త్రవేత్త డేవిడ్‌ మెక్‌క్యాండ్‌లెస్‌ తేల్చారు.

భార‌తీయుల స్టైల్ వేరు.. డ‌బ్బుకు, కెరీర్‌కు ప్రాధాన్యం

ప్రేమపై భారతీయ యువతీ యువకుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దీనిపై సోషల్‌ నెట్‌వర్క్‌ యాప్‌ ‘బంబుల్‌’ చేప‌ట్టిన స‌ర్వేలో భారతీయ యువ‌తీ యువ‌కులు.. వయసు, విద్య, సామాజిక నేపథ్యం, సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆర్థిక‌ స్థిరత్వం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని దాటుకుని ముందుకు సాగడం తమవల్ల కాదని 35 శాతం మంది యువకులు అభిప్రాయ‌ప‌డ్డారు. 50–55 శాతం మంది ‘జస్ట్‌ ఫ్రెండ్స్‌’గానే ఉన్నామని వెల్లడించారు. ప్రేమించుకున్న జంటల్లో కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే పెళ్లి వరకూ వెళుతున్నట్టు వెల్లడైంది. మొత్తంగా చూసుకుంటే.. విదేశాల కంఏ భార‌త్‌లో అంతో ఇంతో బాగుంద‌ని తేలింది.