మూవీ రివ్యూ కుంభ‌కోణం.. 76 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయిన మ‌హిళ‌..

దేశంలో కుంభ‌కోణాల‌కు అదీ.. ఇదీ.. అనే తేడా లేకుండా పోయింది. ఒక‌ప్పుడు 2జీ, బొగ్గు గ‌నులు, మైనింగ్ వంటి వ్య‌వ‌హారాల్లోనే స్కాములు బ‌య‌ట‌ప‌డేవి. ఇప్పుడు మ‌ద్యం స్కామ్ అంటూ.. దేశాన్ని కుదిపేస్తోంది. అయితే.. తాజాగా ఢిల్లీలో మూవీ రివ్యూ(సినిమా స‌మీక్ష‌) కుంభ కోణం వెలుగు చూసింది. దీనిలో ఓ మ‌హిళ ఏకంగా 76 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోయింది. మ‌రి ఇది ఎలా జ‌రిగింది? విష‌యం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

ఆన్‌లైన్ యాప్ ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌లను ఆక‌ర్షించి.. వారిని బుట్ట‌లో వేసుకుని.. త‌ర్వాత నిలువునా టోపీ పెడుతున్న వారు పెరుగుతున్నారు. ఇలానే.. సినిమాలు చూసి రివ్యూ రాసే పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తామని చెప్పే వారు కొంద‌రు.. వాటికి రేటింగ్ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని కొంద‌రు.. మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.

ఈ త‌ర‌హాలోనే ఇంటి నుండి పని చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తార‌నే ప్ర‌క‌ట‌న‌తో ఆక‌ట్టుకుని.. నిలువునా ముంచేస్తున్నారు. ఇలాంటి వారి ఉచ్చులో చిక్కుకున్న ఓ జంట ఏకంగా రూ. 1 కోటికి మోస‌పోయారు. గుజరాత్‌కు చెందిన ఈ జంట ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్‌లను కొనుగోలు చేసి బాలీవుడ్, హాలీవుడ్ మరియు సౌత్ సినిమాల నుండి విభిన్నమైన సినిమాలను చూడాలని,వాటికి రివ్యూలు.. రేటింగ్ ఇవ్వాల‌ని కోరడంతో ఏదో ఇంటి ప‌ట్టునే ఉంటూ.. కొంత సంపాయించుకోవ‌చ్చ‌ని భావించారు.కానీ, ఇది వారిని మొత్తానికే మోసం చేసింది.

ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోనూ చోటు చేసుకుంది. అక్కడ ఒక మహిళ ఇదే విధమైన సినిమా రేటింగ్ స్కామ్‌లో పడి సుమారు రూ. 76 లక్షలు పోగొట్టుకుంది. గురుగ్రామ్ అలెర్జీలో MNC లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న దివ్య అనే మహిళ పార్ట్‌టైమ్ జాబ్ అవకాశం కోసం పడిపోవడంతో ఆన్‌లైన్‌లో రూ. 76 లక్షలకు పైగా పోగొట్టుకుంది.

పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు..

న్యూకాలనీకి చెందిన బాధితురాలు దివ్య ను ఫిబ్రవరి 25న మీరా అనే మహిళ టెలిగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం సంప్రదించింది. రెండు రోజుల తర్వాత తేజస్వి అనే మరో మహిళ ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. పార్ట్‌టైమ్ ఉద్యోగం Bitmaxfilm.com యాప్‌లో సినిమాలకు రేటింగ్ ఇవ్వడం ద్వారా అదనపు డబ్బు సంపాదించడానికి రిజిస్టర్ చేసుకోవాల‌ని కోరింది.

“కనీసం ప్రతిరోజు ఒక సెట్ పూర్తి చేయాలని నాకు కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఒక్కో సెట్‌లో 28 సినిమాలకు రేటింగ్ ఇవ్వాలి. రేటింగ్ ప్రారంభించడానికి, ఖాతాకు రూ. 10,500 రీఛార్జ్ చేయాలి. ఆ తర్వాత నా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని నాకు చెప్పారు. దీంతో అందులో చేరాను“ అని బాధితురాలు దివ్య పేర్కొంది.

“టికెట్లను రేటింగ్ చేస్తున్నప్పుడు, నేను ప్రీమియం టిక్కెట్‌ను పొందినట్లు ప్లాట్‌ఫారమ్‌లో నాకు సందేశం వచ్చింది. ఈ ప్రీమియం టిక్కెట్ కోసం నేను నెగటివ్ బ్యాలెన్స్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నేను నెగటివ్ బ్యాలెన్స్ చెల్లించకపోతే, నేను పూర్తి చేయలేను. ఇలా మొదట రూ.29,500, ఆ తర్వాత మళ్లీ రూ.82,541 డిపాజిట్ చేశాను.. లెవల్ పెరిగిపోవడంతో 30 టిక్కెట్లు పూర్తి చేయాల్సి వచ్చింది. మళ్లీ 5,48,658 నెగిటివ్ బ్యాలెన్స్ చూపించింది. పూర్తి చేసేందుకు రూ.9,59,357 డిపాజిట్ చేయాలని మళ్లీ అడిగారు. ఆఖరి టికెట్, కానీ తర్వాత, నేను 8వ స్థాయికి చేరుకున్నానని. నేను 35 టిక్కెట్లను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు,” అని దివ్య పేర్కొంది.

లావాదేవీ పూర్తయిన తర్వాత తన డిపాజిట్లన్నింటినీ విత్‌డ్రా చేసుకోవచ్చని హామీ ఇవ్వడంతో రూ.21,23,765 డిపాజిట్ చేసింది. అయితే, అప్ప‌టికే మొత్తం రూ.76,84,493 జమ చేయడం.. అటు వైపు నుంచి రూపాయి కూడా తిరిగి రాక‌పోవ‌డంతో మోసానికి గురైనట్లు గుర్తించింది. దీంతో మంగళవారం సైబర్ క్రైమ్, వెస్ట్, పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 420 (చీటింగ్), ఐటి యాక్ట్ సెక్షన్ 66-డి కింద పోలీసులు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. సో.. రూపం ఏదైనా.. ఆన్ లైన్ మోసాల‌కు మాత్రం అంతు లేకుండా పోయింద‌ని పోలీసులు చెబుతున్నారు.