‘నాన్నా వాళ్లను వదలొద్దు’.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

హైదరాబాద్‌లోని నార్సింగిలో శ్రీచైతన్య కాలేజ్ క్లాస్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాలేజ్ ప్రిన్సిపల్, కొందరు లెక్చరర్లు తనను ఎంతగా వేధించారో ఆ విద్యార్థి తన సూసైడ్ నోట్‌లో రాశాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్ టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై యాక్షన్‌ తీసుకోవాలని సాత్విక్ ఆ లేఖలో కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని అమ్మ, నాన్న, అన్నయ్యలను సాత్విక్ కోరాడు.

‘నాన్నా నేను ఈ పనిచేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. ప్రిన్సిపల్, ఇంచార్జ్, లెక్చరర్ల వల్లే చనిపోతున్నాను. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్‌ల వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఈ ముగ్గురూ హాస్టల్ విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోండి’ అని సాత్విక్ తన లేఖలో రాశాడు.

కాగా సాత్విక్ ఆత్మహత్యకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. సాత్విక్ కుటుంబసభ్యులతో కలిసి కాలేజ్ ముందు ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాలేజ్ మేనేజ్మెంట్‌పై యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాంతో ఉస్మానియాలో సాత్విక్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. మరోవైపు సాత్విక్ మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సాత్విక్ మృతికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు.