కాల్పుల కలకలంతో తరచూ వార్తల్లో నిలిచే అమెరికాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 78 ఏళ్ల పెద్ద మనిషి (థామస్ లీ) ఒకరు పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. పారిశ్రామిక వర్గాల్లోనూ ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఆఫీసు రూంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. దాదాపు రూ.16,500 కోట్లకు పైనే ఆస్తిపాస్తులు ఉన్న ఈ పారిశ్రామికవేత్త సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఆత్మహత్యకు కారణాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇంతకీ సూసైడ్ చేసుకున్న థామస్ లీ ఎవరు? ఆయన ఎంత ప్రముఖుడన్న విషయానికి వస్తే?
అమెరికాలో ప్రముఖ ఇన్వెస్టర్.. ఫైనాన్షియర్.. ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్.. ఇన్వెస్ట్ మెంట్ బిజినెస్ లకు ఆయన్ను ఒక మోంటార్ గా భావిస్తారు. అలాంటి అతను తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం మన్ హట్టన్ లోని తన ఆఫీసులోనే ఆయన పిస్టల్ తో కాల్చుకొని చనిపోయిన వైనాన్ని గర్తించారు. ఎప్పటిలానే ఆఫీసుకు వచ్చిన ఆయన చాలాసేపు తన రూంలో నుంచి బయటకు రాలేదు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది రూంలోకి వెళ్లి చూడగా.. బాత్రూంలో పడి ఉన్న వైనాన్ని గుర్తించారు.
ఆయన తలకు బులెట్ గాయమైనట్లుగా గుర్తించారు. తనకు తాను కాల్చుకొని మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఆయన మరణంపై ఆయన కుటుంబ సభ్యులు ఒక నోట్ ను విడుదల చేశారు కానీ ఆత్మహత్యకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆయన నికర సంపద దాదాపు రెండు బిలియన్ డాలర్లుగా చెబుతారు. మన రూపాయిల్లో రూ.16500 కోట్ల వరకు ఉంటుంది. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతులకు స్నేహితుడు కూడా.
1974లో థామస్ హెచ్ లీ పార్ట్నర్స్ పేరుతో బిజినెస్ ప్రారంభించిన ఆయన 2006 లో ‘లీ ఈక్విటీ’ని స్టార్ట్ చేశారు. గడిచిన యాభై ఏళ్లలో ఆయన వందలాది సంస్థల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వ్యాపారవేత్తగానే కాదు.. దాతగా కూడా ఆయనకు మంచి పేరుంది. పలు పేరున్న సంస్థలు.. వర్సిటీలకు ఆయన ట్రస్టీ హోదాలోనూ.. బోర్డు సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates