ఒక్కోసారి అంతే. కాలం బాగున్నంత వరకు అన్ స్టాపబుల్ అన్నట్లుగా కొందరి జర్నీ ఉంటుంది. కానీ.. లెక్క తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. దేశంలో తిరుగులేని వ్యాపార దిగ్గజంగా.. తాను కోరుకున్నది సొంతం అయ్యే వరకు సామ దాన దండోపాయాల్లో దేనికైనా సరే సిద్దమన్నట్లుగా వ్యవహరించేందుకు గౌతమ్ అదానీ సిద్దంగా ఉంటారన్న పేరు మార్కెట్ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలా అని.. ఆయన గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. లీగల్ నోటీసులు వరుస పెట్టి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని.. దాని కంటే మౌనంగా ఉండటం మంచిదనన మాట వినిపిస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలోనూ.. యూ ట్యూబ్ చానళ్లలోనూ ఎవరి మీదనైనా సరే.. వెనుకా ముందు చూసుకోకుండా చెలరేగిపోయే కొందరు బడా విశ్లేషకులు సైతం అదానీని విమర్శలు చేసే విషయంలో తటపటాయిస్తుంటారు. అలాంటి అదానీ పరిస్థితి ఇవాల్టి రోజున దారుణంగా మారింది. హిండెన్ బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికతో మొదలైన అదానీ కుంగుబాటు.. రోజులు గడిచే కొద్దీ అంతకంతకూ ఇబ్బందికరంగా మారుతోంది. గురువారం ఒక్కరోజులో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఒక్కరోజులో ఇన్ని షాకులా? అన్న భావన కలుగక మానదు.
మరే సంస్థ అయినా సరే.. ఇలాంటివి ఎదురైతే ఈపాటికి బేర్ మనే పరిస్థితి. కానీ.. అదానీ కాబట్టి ఆ మాత్రం తట్టుకొని నిలబడే పరిస్థితి. ఈ రోజు (గురువారం) చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే..
- అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన సెక్యురిటీలపై ఎలాంటి మార్జిన్ రుణాలు ఇవ్వకూడదని సిటీ గ్రూప్ నకు చెందిన వెల్త్ యూనిట్ నిర్ణయించింది.
- క్రెడిట్ సూయిజ్ ఏజీ సైతం అదానీ గ్రూప్ బాండ్లపై రుణాల్ని ఇవ్వటాన్ని నిలిపేసింది. అదానీ బాండ్ల విలువను జీరోగా పేర్కొని షాకిచ్చింది.
- అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణలు.. స్టాక్ మార్కెట్లో ఆ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతున్న వేళలో ఆర్ బీఐ ఎంట్రీ ఇచ్చింది. అదానీ గ్రూప్ లోని కంపెనీలకు ఏయే బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయన్న అంశంపై ఆరా మొదలు పెట్టింది. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రాలేదు.
- వరుస పెట్టి ఎదురవుతున్న ఎదురుదెబ్బలతో అదానీ గ్రూప్ నకు సంబంధించిన షేర్లు దారుణంగా నష్టపోతున్నాయి. అదానీ గ్రూప్ లో అంబుజా, ఏసీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ విషయానికి వస్తే.. అదానీ ఎంటర్ ప్రైజస్ షేరు 26 శాతం కుంగితే.. అదానీ పోర్ట్స్ 7 శాతం.. అదానీ ట్రాన్స్ మిషన్ 10 శాతం.. అదానీ గ్రీన్ ఎనర్జీ 10 వాతం.. అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం.. అదానీ విల్మార్ 5 శాతం.. ఎన్డీటీవీ 5 శాతం.. అదానీ పవర్ 4.9 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిండెన్ బర్గ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత.. ఇప్పటివరకు గ్రూప్ నకు చెందిన 100 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైన పరిస్థితి. ఈ భారీ మొత్తాన్ని మన రూపాయిల్లో చెప్పాలంటే.. 8.2 లక్షల కోట్ల మేర నష్టపోయిన పరిస్థితి.