షాపులో అమ్మింది తీసుకోవడం.. అది ఎలా ఉన్నా సర్దుకుపోవడం.. మహా అయితే వస్తువును రిటర్న్ చేయడం.. ఇంతకుమించి మనం చేసేదేమీ ఉండదని అనుకుంటాం. కానీ వినియోగదారులకు కొన్ని హక్కులు ఉంటాయని.. వాళ్ల కోసం బలమైన చట్టాలున్నాయని.. కన్జూమర్ ఫోరంకు వెళ్తే వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతారని చాలామందికి తెలియదు. ఈ దిశగా ఆలోచనే చేయరు.
ఐతే ఇప్పటికే కొంచెం కఠినంగానే ఉన్న వినియోగదారుల భద్రత చట్టాన్ని.. ఇప్పుడు మరింత బలోపేతం చేస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం వినియోగదారులకు కొత్త హక్కులు వచ్చాయి. తాము కొన్న వస్తువు విషయంలో ఏదైనా తేడా జరిగితే చిన్న వస్తువుకు కూడా లక్ష రూపాయల వరకు పరిహారం పొందే అవకాశం ఇస్తోంది ఈ చట్టం.
ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే ఉత్పత్తుల నుంచి వినియోగదారుడికి భద్రత కల్పించడం.. కంపెనీలు తమ ఉత్పత్తి, పరిమాణం, సామర్థ్యం, స్వచ్ఛత, ప్రమాణాలు, ధరలపై పూర్తి సమాచారాన్ని కచ్చితంగా అందజేయడం.. ఒకే ఉత్పత్తికి ఇతర పోటీదారులు ఆఫర్ చేస్తున్న ధరలను తప్పక తెలియజేయడం.. న్యాయసమ్మతం కాని, నిషేధిత ఉత్పత్తుల విషయంలో వినియోగదారులకు పరిహారం అందించడం.. ఇవీ వినియోగదారులకు కొత్తగా సంక్రమించిన నాలుగు హక్కులు.
ఇక ఈ చట్టం ప్రకారం కల్తీ వస్తువుల విషయంలో లక్ష వరకు పరిహారం పొందవచ్చు. వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తే రూ.5 లక్షల నుంచి 10 లక్షల దాకా జరిమానా.. రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు తెచ్చారు. ఆ ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం జైలు శిక్షలు తప్పవు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల వివాదాలు, నష్టపరిహార కమిషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చట్టం వినియోగదారుల వ్యవహారాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని నిపుణులు అంటున్నారు.