గ‌న్న‌వ‌రంలో బ‌రులు సిద్ధం.. వీఐపీ పాస్‌.. 60 వేలు!

సంక్రాంతి సంబ‌రాలకు రాష్ట్రం మొత్తం రెడీ అవుతుంటే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌కవ‌ర్గం మాత్రం.. భారీ ఎత్తున కోడి పందేల‌కు రెడీ అవుతోంది. వైసీపీకి చెందిన కీల‌క నేతల క‌నుస‌న్న‌ల్లో ఇక్క‌డ బ‌రులు రెడీ అయ్యాయి. ఒక్కొక్క బ‌రికి రెండు ఎక‌రాలు కేటాయించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఏసీలు, పార్కింగ్‌.. ఇందులోనూ వైఐపీ, ఏ గ్రేడ్ వీఐపీ, బీ గ్రేడ్ వీఐపీ అంటూ.. వివిధ ర‌కాల పాసులు కూడా రెడీ చేశారు.

ఒక్కొక్క బ‌రిలో పోటీ ప‌డే కోళ్లు.. వాటి స‌త్తా.. ఆట తీరు.. ఇలా అనేక ప్ర‌మాణాల‌ను అనుస‌రించి.. ఫ్ల‌డ్ లైట్ల కాంతుల్లో శుక్ర‌వారం నుంచి సోమ‌వారం వ‌ర‌కు ఈ పందేలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక‌, గ్రేడ్ ఏ పాస్ 60000, గ్రేడ్ బి పాస్ 40000, వీఐపీ పాస్ 25000 చొప్పుల‌న విక్ర‌యిస్తున్నారు. పాసులు తీసుకున్న వారు మూడు రోజుల్లో ఎప్పుడైనా రావొచ్చు పోవ‌చ్చు. వీరి వెంట ఇద్ద‌రిని మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు.

వీరికి స‌క‌ల సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకంగా మ‌ద్యం కోరుకునేవారికి వేరేగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోవైపు.. వీఐపీలు అంద‌రికీ.. ఏసీ హాళ్ల‌లో క్వాలిటి చికెన్ బిర్యాని, బ్రేక్ ఫాస్ట్‌లో 15 ర‌కాల టిఫెన్లు ఏర్పాటు చేస్తున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నంలో చికెన్‌, మ‌ట‌న్‌, చైనా, జ‌పాన్ ఆహార ప‌దార్థాల‌ను కూడా రెడీ చేస్తున్నారు. ప్ర‌త్యేకంగా ఢిల్లీ నుంచి చెఫ్‌ల‌ను ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే..డ‌బ్బులు క‌ట్టినా కూడా ఎవ‌రికి ప‌డితే వారికి ఎంట్రీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. స్థానికంగా ఉన్న కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల అనుచ‌రుల క‌నుస‌న్న‌ల్లోవారు చెప్పిన వారికే ఈ టికెట్లు విక్ర‌యిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!