జర్నలిస్టు ఉగ్రరూపం.. సారీ చెప్పిన స్టార్ హీరో

మలయాళంలో తెరంగేట్రం చేసినా.. నెమ్మదిగా వేరే పరిశ్రమల్లో కూడా మంచి గుర్తింపే సంపాదించాడు దుల్కర్ సల్మాన్. తండ్రి మమ్ముట్టి సూపర్ స్టార్ అయినా.. ఆయన ఇమేజ్‌ను తనకోసం ఎంతమాత్రం వాడుకోకుండా సొంతంగా గుర్తింపు కోసం ప్రయత్నించాడు. నటుడిగా చాలా త్వరగా గొప్ప పేరు సంపాదించాడు. ఇప్పుడు అతడికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. కొత్త తరహా సినిమాలు, ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే దుల్కర్.. తాజాగా వెబ్ సిరీస్‌లోకి కూడా అడుగు పెట్టాడు. స్వీయ నిర్మాణంలో నెట్ ఫ్లిక్స్ కోసం అతను ‘వరణె ఆవశ్యముండ్’ అనే సిరీస్ చేశాడు. ఇటీవలే దాని ప్రిమియర్ కూడా వేశారు. ఐతే అందులో ఒక సన్నివేశం వివాదానికి దారి తీసింది. ఒక చోట తన అనుమతి లేకుండా ఫొటోలు వాడటంపై ముంబయి బేస్డ్ జర్నలిస్ట్ చేతన కపూర్ మండి పడింది.

వెయిట్ లాస్ ట్రీట్మెంట్ జరగడానికి ‘ముందు-తర్వాత’ ఓ అమ్మాయి ఎలా ఉందో చూపిస్తూ ఓ సన్నివేశంలో చేతన కపూర్ ఫొటోలే వాడారు సినిమాలో. దీనినై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దుల్కర్ ప్రొడక్షన్ హౌస్ మీద డిఫమేషన్ సూట్ వేస్తానని హెచ్చరించింది. అతను తనకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. ఐతే జరిగిన పొరబాటుపై దుల్కర్ స్పందించాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఈ తప్పుకు పూర్తి బాధ్యత తాము వహిస్తామని.. సదరు ఫొటోలు ఎలా తీసుకున్నారో, సినిమాలో వాడారో పరిశీలిస్తామని దుల్కర్ చెప్పాడు. చేతన్ మనోభావాలు దెబ్బ తీసినందుకు క్షమాపణలు చెబుతున్నామని.. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని దుల్కర్ వివరణ ఇచ్చాడు.దుల్కర్ క్షమాపణను చేతన అంగీకరించింది. లీగల్ నోటీసులు ఇచ్చే విషయంలో తాను వెనక్కి తగ్గుతున్నట్లు కూడా ప్రకటించింది. సినిమా దర్శకుడు అనూప్ సత్యన్ వ్యక్తిగతంగా తనకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పినట్లు కూడా చేతన వెల్లడించింది.