మ‌నం మ‌రిచిన Luna త్వ‌ర‌లో రీ ఎంట్రీ!!

Luna.. ఈ పేరు బ‌హుశ ఇప్ప‌టి త‌రం ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. ఓ 30 ఏళ్ల‌కు కింద‌టి ప్ర‌పంచా నికి వెళ్తే.. లూనా మోపెడ్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల దివ్య వాహ‌నం, క‌ల్ప‌త‌రువు ఇదే! అప్ప‌ట్లో కేవ‌లం 8 నుంచి 10 వేల‌కే ఈ వాహ‌నం ల‌భ్య‌మ‌య్యేది. అంతేకాదు.. దీనిని న‌డ‌పడం ఈజీ.. లైసెన్స్ కూడా అవ‌స‌రం లేదు.

ఎందుకంటే.. ఇది 50 సీసీ ఇంజ‌న్ కావ‌డంతో ర‌వాణా చ‌ట్టం ప్ర‌కారం.. దీనిని న‌డిపేవారు 18 ఏళ్లు పైబ‌డి ఉంటే చాలు లైసెన్స్‌తోనూ ప‌ని ఉండేది కాదు. దీంతో ఈ వాహ‌నం.. అప్ప‌ట్లో హాట్ కేకులా అమ్ముడు పోయింది. ఎవ‌రి ఇంటి ముందు చూసినా.. లూనా క‌నిపించేంది. అంతేకాదు.. అప్ప‌ట్లో లూనా రిపేర్ స్పెష‌లిస్టు అనే బోర్డులు కూడా క‌నిపించాయి.

అయితే, కాల‌క్ర‌మంలో మార్పులు చోటు చేసుకోవ‌డం, హీరో హోండా వంటి సంస్థ‌లు రావ‌డంతో లూనా మూల‌న‌ప‌డింది. దాదాపు ఇప్పుడు అంద‌రూ మ‌రిచిపోయారు. అయితే.. ఇప్పుడు ఈ లూనా.. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత‌(50 అంటున్నారు) తిరిగి త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించేందుకు రోడ్ల‌పై ప‌రుగులు పెట్టేందుకురెడీ కానుంది. అయితే, ఈ సారి పెట్రోల్‌తో కాదు.. బ్యాట‌రీతో!

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, 2030 నాటికి ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ స‌ద‌స్సు తీర్మానాన్ని చేరుకోవాల‌న్న ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో బ్యాట‌రీ వాహ‌నాల‌కు ప్రోత్సాహం పెరిగింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక బ్యాట‌రీ వాహ‌నాలు వ‌చ్చినా.. తిరిగి లూనా.. త‌న‌దైన శైలిలో భార‌త ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు స‌రికొత్త రూపంతో త్వ‌ర‌లోనే అవ‌తార్ -ఈవీగా రానుంది. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.