జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి అందరూ హాజరు కావాలని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. విభేదాలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణలోని గాంధీభవన్లో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కుటుంబసభ్యులకు దోచిపెట్టడానికే కేసీఆర్ దేశం మీద పడ్డారని రేవంత్ విమర్శించారు. స్వాతంత్య్ర పూర్వపు పరిస్థితులే ఇప్పుడు దేశంలో నెలకొన్నాయని రేవంత్రెడ్డి మండిపడ్డారు. బ్రిటీష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ పాదయాత్ర భయంతోనే మోడీ కోవిడ్ రూల్స్ తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్ ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని రేవంత్ ప్రశ్నించారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అంతా పాల్గొని ప్రజల పక్షాన నిలవాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందన్న రేవంత్ ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందని తెలిపారు.