శివ్ నాడార్…ఐటీ రంగంలో ఎదురులేని ‘రాడార్’

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ….మహా పురుషులవుతారు…కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాలు వింటుంటే చరిత్రలో నిలిచిపోయిన…చరిత్ర సృష్టించిన కొందరు వ్యక్తుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ చరిత్ర సృష్టించేందుకు సదరు వ్యక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు…పడ్డ కష్టాలు…రాబోయే తరాలకు పాఠాలవుతాయి. అటువంటి వ్యక్తులు నెలకొల్పిన సంస్థలు….భావితరపు వ్యాపారవేత్తలకు మార్గదర్శకాలవుతాయి.

మొక్కవోని దీక్షతో….వైఫల్యాలకు కుంగిపోకుండా….విజయాలకు పొంగిపోకుండా…తమ నుదుటిరాతను తామే రాసుకున్న దిగ్గజ వ్యాపారవేత్తలు మన దేశంలో ఎందరో ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో ఒకరు ‘HCL’ వ్యవస్థాపకుడు శివ నాడర్.

కంప్యూటర్ రంగంలో ఓనమాలు కూడా తెలియని శివ్ నాడర్…అనతి కాలంలోనే కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగంలో దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకం. దేశం గర్వించదగ్గ గొప్ప వ్యాపారవేత్తలలో ఒకరైన శివ నాడార్..నేడు చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

తన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా…..తన కుమర్తె రోష్ని నాడార్ మల్హోత్రాను నియిమిస్తున్నట్లు వెల్లడించారు. శివ్ నాడర్ ఈ దేశంలో కాకుండా మరో దేశంలో పుట్టి ఉంటే మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఉండేవారంటూ హెచ్‌సిఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) వినీత్ నాయర్ అన్నారు. దీనిని బట్టి శివ్ నాడార్ సామర్థ్యం ఏమిటన్నది తెలుస్తోంది.

ప్రస్తుతం మన దేశంలో మేక్ ఇన్ ఇండియా బాగా పాపులర్ అయింది. అయితే, చాలా సంవత్సరాల క్రితమే భారత్ లో మేక్ ఇన్ ఇండియా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రారంభించిన మొట్టమొదటి పారిశ్రామికవేత్త శివ్ నాడర్ అన్న సంగతి అతి కొద్దిమందికే తెలుసు. కంప్యూటర్ రంగం భవిష్యత్తును ముందుగానే ఊహించిన శివ్ నాడార్….1976 లో ఢిల్లీలో ఓ చిన్నగదిలో తన సంస్థకు అంకురార్ఫణ చేశారు. మన దేశం పేరు మార్మోగేలా…’హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్’ అని తన సంస్థకు పేరు పెట్టారు. 1988లో హెచ్ సీఎల్ కంపెనీ యునిక్స్ కంప్యూటర్‌ను తయారు చేసే నాటికి హ్యూలెట్ ప్యాకర్డ్ (HP) వంటి సంస్థలు హెచ్ సీఎల్ కంటే 3 సంవత్సరాల వెనుకబడి ఉన్నాయంటే శివ్ నాడర్ ముందు చూపు ఏమిటో అర్థమవుతోంది.

అప్పట్లో లైసెన్స్ వంటి వ్యవహారాల్లో కంపెనీకి వచ్చిన పలు సమస్యలను అధిగమించి…HCL ను ఒక బ్రాండ్ గా నిలిపిన ఘనత శివ్ నాడర్ దే. గతంలో హార్డ్ వేర్ కంపెనీలకు కేంద్రం విధించిన కష్టతరమైన నిబంధనలను తట్టుకొని మరీ విజయపథంలో నడిచారు శివ్ నాడార్. తోటి పారిశ్రామికవేత్తలు, నిపుణులు అమెరికా బాట పడుతున్నా…స్వదేశానికి సేవ చేయాలన్న తలంపుతో నాడర్ ఇక్కడే ఉండిపోయారు. వారిలాగా నాడర్ కాలిఫోర్నియాలో సెటిల్ అయి ఉంటే, ఇపుడు 500 బిలియన్ డాలర్ల కంపెనీకి అధినేతగా ఉండేవారు. ప్రస్తుతం హెచ్ సీఎల్ కంపెనీ విలువ 9.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

రిస్క్ తీసుకోవడం శివనాడర్ కు రస్క్ తిన్నంత ఈజీ అట. అందుకే, రిస్క్ వై2కే సంక్షోభం తర్వాత ఐటీ రంగం ఉనికే ప్రశ్నార్థకమైన సందర్భంలోనూ శివ్ నాడర్ వెనుకడుగు వేయలేదు. అప్పటిదాకా దేశీయంగా హార్డ్ వేర్ ఉత్పత్తులను, కంప్యూటర్లను తయారు చేసి అమ్మిన శివ్ నాడార్… 2000 సంవత్సరం నాటికి ఐటి రంగంలో అడుగుపెట్టారు. 2009 లెమాన్ బ్రదర్స్ సంక్షోభంలో ఐటీ సెక్టార్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీశాయి. కానీ, ఉద్యోగుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అన్న సూక్తిని నమ్మిన శివ్ నాడర్… ఉద్యోగులను తొలగించలేదు. తమ సంస్థకు ఉద్యోగులే బలమని శివ్ నాడర్ గర్వంగా చెప్పేవారు. అయితే, ఆ ఉద్యోగులకు శివ్ నాడర్ వంటి యజమమానే నిజమైన బలం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కంప్యూటర్, ఐటీ రంగాల భవిష్యత్తును రాడార్ లా పసిగట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన శివ్ నాడార్…ఎందరికో స్ఫూర్తిదాయకం.