కొత్త టెక్నాలజీగా మొదలై విప్లవంగా మారుతున్న ఏఐ సాంకేతికత భవిష్యత్తులో ఎన్ని పుంతలు తొక్కుతుందో కానీ ప్రాధమిక దశలో ఇది చేస్తున్న అద్భుతాలు చూసి ఒక పక్క ఆనందం, మరోపక్క ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిన్నటికి నిన్న స్క్విడ్ గేమ్ లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఒక ఔత్సాహికుడు చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. నిజ జీవితంలో చూసే అవకాశమే లేని కాంబోలు దాంట్లో రియల్ గా అనిపించాయి. ఇది వీటికే పరిమితం కావడం లేదు. సంగీతంలోనూ అడుగు పెట్టింది. ఇటీవలే తమన్ AI గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన వివరించాడు.
గేమ్ ఛేంజర్ లో తొలుత అనధికారంగా లీకై విమర్శకులకు గురైన మొదటి పాట జరగండి జరగండి. ఆడియో క్వాలిటీ సరిగా లేకవడం వల్ల దాని మీద నెగటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి. అయితే మొదటగా దీన్ని హైదరాబాద్ కు చెందిన హనుమాన్ అనే గాయకుడితో పాడించారు. బాద్షాలో బంతిపూల జానకి సాంగ్ ని రిఫరెన్స్ గా తీసుకుని జరగండి జరగండి పాటకు దలేర్ మెహేంది పాడినట్టుగా ఏఐ టెక్నాలజీ వాడి రీ క్రియేట్ చేశారు. దీంతో ఆయనే నిజంగా పాడారనే అనుభూతి కలిగింది. అఫ్కోర్స్ ఇవన్నీ అనుమతులు గట్రా తీసుకునే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంతకు ముందు ఏఆర్ రెహమాన్ ఈ ప్రయోగం చేశారు.
ఏది ఎలా ఉన్నా గేమ్ ఛేంజర్ మెయిన్ హైలైట్స్ లో జరగండి పాట ప్రధానంగా ఉంటుందని ఎస్జె సూర్యతో సహా టీమ్ లో పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. తమన్ కూడా దీని గురించి మాములు ఎలివేషన్ ఇవ్వడం లేదు. ఖరీదయిన సెట్లలో ప్రభుదేవా కొరియోగ్రఫీకి రామ్ చరణ్, కియారా అద్వానీలు కలిసి చేసిన డాన్స్ థియేటర్లను ఊపేస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ఇందులో ఏ మేరకు నిజముందో తెలిసిపోతుంది. సంక్రాంతికి మొదటగా వస్తున్న సినిమాగా గేమ్ ఛేంజర్ మీద ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ వర్గాలు ఫలితం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.