పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ ని జోడించి జనవరి 11 నుంచి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. సరిగ్గా సంక్రాంతి పండగ టైంలో ఇలాంటి ఎత్తుగడ బిజినెస్ కోణంలో మంచి ఫలితం ఇచ్చే అవకాశం లేకపోలేదు.
సినిమా ప్రారంభంలో అసంపూర్ణంగా ఉన్న జపాన్ ఎపిసోడ్, చైల్డ్ హుడ్ సీన్స్, షెకావత్ – పుష్పరాజ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ట్రైలర్ లో ఉండి తెరమీద మాయమైన వాటిని ఇందులో పొందుపరిచబోతున్నారని టాక్. ఇక్కడింకో పాయింటుంది.
ఇప్పటిదాకా 1831 కోట్ల గ్రాస్ తో బాహుబలి 2ని దాటేసి నెంబర్ వన్ గా ఉన్న పుష్ప 2 ది రూల్ అసలు టార్గెట్ రెండు వేల కోట్లు. కానీ ఇప్పటికే నెల రోజుల రన్ అయిపోయింది. పండక్కు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం క్యూ కట్టాయి. సో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కలెక్షన్లు ఆశించడం కష్టం.
కానీ బాలీవుడ్ లో మాత్రం పుష్ప 2 దూకుడు పూర్తిగా తగ్గలేదు. ఈవెనింగ్ సెకండ్ షోలతో పాటు వీకెండ్స్ లో భారీ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. ఈ వారం హిందీలో చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఖచ్చితంగా పని చేస్తుంది. ఆ కారణంగానే మైత్రి లక్ష్యాన్ని చేరుకునేందుకు భలే ఎత్తుగడ వేసింది.
ఇప్పుడు మొత్తం కలిపి 3 గంటల 40 నిమిషాల వరకు పుష్ప టూ చేరుకుంది. అంటే ఇంటర్వల్ తో కలిపి సుమారు నాలుగు గంటలు ఆడియన్స్ హాల్లోనే గడపబోతున్నారు. లెన్త్ పరంగా ఇప్పటిదాకా వచ్చిన అత్యంత సుదీర్ఘమైన నిడివి కలిగిన సినిమాల సరసన పుష్ప 2 చేరబోతోంది.
కాకపోతే దానవీరశూరకర్ణ, లగాన్, ఎల్ఓసిలను దాటాకపోవచ్చు కానీ టాప్ 5లో ఉండటం ఒకరకంగా మైలురాయే. మరి బ్యాలన్స్ ఉన్న 170 కోట్లను అదనంగా జోడించిన ఫుటేజ్ ఎంతమేరకు సాధిస్తుందో చూడాలి. మన దగ్గరేమో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ ఇంకోసారి చూసేందుకు ఎగబడినా ఆశ్చర్యం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.