మంగళవారం తెల్లవారుజామున నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో తీవ్ర భూకంపం సంభవించి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. పలు భవనాలు కూలిపోగా, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడినట్లు టిబెట్ అధికారులు తెలిపారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ భూకంపం ప్రభావం నేపాల్‌తో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ కన్పించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నివేదించబడింది. అలాగే బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6:30 గంటలకు మొదటిసారి భూమి కంపించగా, 7:02 గంటలకు 4.7 తీవ్రతతో రెండో ప్రకంపన, అనంతరం 4.9 తీవ్రతతో మరో ప్రకంపన చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.
భూగర్భ టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాలకు సమీపంలోని ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో నేపాల్‌లో జరిగిన భూకంపం అందుకు ఉదాహరణ. ఆ ఘటనలో 9,000 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా భూకంపం మరోసారి ఆ భయానకాన్ని గుర్తు చేసింది. ప్రజలు భయాందోళనలో ఉంటూనే ఆస్తి, ప్రాణ నష్టాన్ని భరించాల్సి వస్తోంది.
భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టిబెట్ మరియు నేపాల్ ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయక చర్యలకు తెరతీశాయి. చికిత్స కోసం బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గాయపడిన వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.