‘పుష్ప-2’ మీద కోపం ‘గేమ్ చేంజర్’పై చూపిస్తున్నారు

‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాలో అసిసోయేట్ కావడం వల్ల కూడా బాలీవుడ్ వాళ్లు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయి బాలీవుడ్ కిందికి నీళ్లొచ్చే పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాతి కొన్నేళ్లలో బాహుబలి-2, కేజీఎఫ్, కేజీఎఫ్-2, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్నందుకుని.. వాటి ముందు బాలీవుడ్ సినిమాలు వెలవెలబోయాయి.

ఇటీవల పుష్ప-2 అసాధారణ విజయాన్నందుకుని బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేయడంతో బాలీవుడ్ జనాల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఇది చాలదన్నట్లు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ.. పుష్ప-2ను ఉదాహరణగా చూపిస్తూ సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలు తేలిపోతున్న విషయాన్ని నొక్కి చెప్పి వాళ్ల ఇగో మరింత హర్ట్ అయ్యేలా చేశాడు.

దీంతో సౌత్ సినిమాల నుంచి నానాటికీ పెరిగిపోతున్న ముప్పు విషయంలో బాలీవుడ్ అలెర్ట్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సౌత్ సినిమాలను తొక్కి పెట్టకపోతే తమ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని వాళ్లు భయపడుతున్నట్లున్నారు. ఈ క్రమంలోనే సౌత్ నుంచి వస్తున్న తర్వాతి పాన్ ఇండియ ా సినిమా ‘గేమ్ చేంజర్’ను అక్కడి వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి హిందీ మీడియాలో, సోషల్ మీడియాలో వరుసగా నెగెటివ్ ఆర్టికల్స్ వస్తుండడం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్ బాలేదని.. నార్త్ ఇండియాలో దీనికి బజ్ లేదని.. బిజినెస్ జరగలేదని.. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రమని వరుసగా ఆర్టికల్స్ గుప్పిస్తున్నారు.

పుష్ప-2 జిజాంటిక్ సక్సెస్ చూసి తట్టుకోలేక పోయిన బాలీవుడ్ జనాలు.. నెల తర్వాత కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న ఆ చిత్రాన్ని దాన్ని ఏమీ చేయలేని స్థితిలో ‘గేమ్ చేంజర్’ మీద పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రెండ్ చూస్తే ‘గేమ్ చేంజర్’ బాలీవుడ్ జనాలకు సాఫ్ట్ టార్గెట్‌గా మారినట్లుగా ఉంది. రేప్పొద్దున రివ్యూల విషయంలోనూ నెగిటివిటీకి టీం రెడీగా ఉండాల్సిందే. ఈ నెగెటివిటీని దాటి ‘గేమ్ చేంజర్’ పాన్ ఇండియా సక్సెస్ అవుతుందేమో చూడాలి.