న‌ర్సుపై మోజుతో భార్య‌కు విషపు ఇంజ‌క్ష‌న్లు!

వివాహేత‌ర సంబంధాలు ఎంత ప‌నిచేయిస్తున్నాయంటే.. తాళి క‌ట్టి.. ఏళ్ల త‌ర‌బ‌డి క‌లిసి జీవించిన భ‌ర్త‌ల‌ను భార్య‌లు చంపేస్తున్నారు. ఇక‌, భార్య‌ల‌ను కూడా భ‌ర్త‌లు మ‌ట్టు బెడుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో ష‌రా మామూలే అన్న‌ట్టుగా మామూలుగా మారిపోయాయి. తాజాగా వేరే మహిళను ఇష్ట‌ప‌డిన ఓ వ్యక్తి.. మొదటి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

రెండో పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మొదటి భార్యకు ప్రాణాంతకమైన ఇంజక్షన్లు, మందులు ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. నిందితుడు స్వప్నిల్ సావంత్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్నిల్ సావంత్.. ప్రియాంకను కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్వప్నిల్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుతో అతడికి పరిచయం ఏర్పడి.. అదికాస్త ప్రేమగా మారింది.

ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే అప్పటికే నిందితుడు స్వప్నిల్కు వివాహం జరిగింది. తన రెండో వివాహానికి మొదటి భార్యే అడ్డుగా ఉందని భావించాడు. ఎలాగైనా మొదటి భార్య ప్రియాంకను హతమార్చాలని ప్లాన్ చేసుకున్నాడు. బీపీ, షుగర్ చికిత్స అని చెప్పి.. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎవరికీ తెలియకుండా ప్రమాదకరమైన విష‌పు ఇంజెక్షన్లను భార్యకు ఇచ్చాడు. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది.

అనంత‌రం.. అత‌ను న‌ర్సును వివాహం చేసుకున్నాడు. అయితే, దీనిపై అనుమానం వ‌చ్చిన మొద‌టి భార్య బంధువులు కేసు పెట్ట‌డంతో విష‌యం వెలుగు చూసింది.