ప్రపంచవ్యాప్తంగా కొంతమందికి పురాతన వస్తువులు, యాంటిక్ పీసులు సేకరించడం అలవాటు. చారిత్రాత్మక వస్తువులను కొనేందుకు కొంతమంది వ్యక్తులు కోట్లు కుమ్మరించడానికి సైతం వెనుకాడరు. ఇక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొందరు వ్యక్తులు వాడిన వస్తువులకైతే గిరాకీ చాలా ఎక్కువ. అటువంటి వస్తువులు మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇటువంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకే కొన్ని ఈ ఆక్షన్ కంపెనీలు కూడా వెలిశాయి. ఇటువంటి వస్తువులను కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ ధరకు రీసేల్ చేయడం ఈ కంపెనీల బిజినెస్. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వేసుకున్న చెప్పుల వేలంపాట వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో జులియెన్స్ అనే ఆక్షన్ కంపెనీ ఆ చెప్పులను వేలం పాటలో కోటి 75 లక్షల రూపాయలకు అమ్మిన వైనం సంచలనం రేపుతోంది.
ఓ అజ్ఞాత వ్యక్తి ఆ చెప్పులను కొనుగోలు చేయడం విశేషం. 1970 నుంచి 80 మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్ బ్రౌన్ లెదర్ శాండిల్స్ ను వాడారు. దీంతో, ఆ చెప్పులను జులియెన్స్ కంపెనీ సొంతం చేసుకొని తాజాగా వాటిని అమ్మేందుకు వేలం పాట పెట్టింది. దీంతో, అది భారీ ధరకు అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఒక కోటి 77 లక్షల రూపాయలకు ఆ చెప్పులను కొనుగోలు చేయడం సంచలనం రేపింది.
యాపిల్ కంపెనీ మొదలుపెట్టిన కొత్తలో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులు వేసుకున్నాడట. అంతేకాదు, యాపిల్ కంప్యూటర్ లాంచ్ చేసే సమయంలో, కొన్ని కీలకమైన సమావేశాలకు హాజరయ్యేందుకు ఈ చెప్పులే వేసుకున్నాడని జులియెన్స్ సంస్థ తెలిపింది. అయితే, ఈ చెప్పులు కొన్న వ్యక్తి ఎవరు అన్న వివరాలను మాత్రం జులియెన్స్ కంపెనీ గోప్యంగా ఉంచింది.