ఓవైపు టీ20 ప్రపంచకప్ హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగిపోతుంటే.. మరోవైపు ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక ఆస్ట్రేలియాలో రేప్ కేసులో అరెస్టవడం సంచలనం రేపుతోంది. గుణతిలక శ్రీలంక జట్టులో సీనియర్ ఆటగాళ్లలో ఒకడు. ఈ ప్రపంచకప్ జట్టులో అతను సభ్యుడే కానీ.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. అందుక్కారణం అతను గాయంతో ఇబ్బంది పడుతుండడమే.
ఫిట్నెస్ సమస్యలున్నప్పటికీ ఆస్ట్రేలియాకు అతణ్ని తీసుకెళ్లిన జట్టు యాజమాన్యం.. మ్యాచ్ ఆడే పరిస్థితి లేకపోవడంతో పక్కన పెట్టింది. తన స్థానంలో వేరే ఆటగాడిని ఎంచుకుంది. కానీ గుణతిలకను ఆస్ట్రేలియాలో జట్టుతో పాటే కొనసాగించారు. కాగా ఇప్పుడు అతడి మీద రేప్ కేసు నమోదైంది.. ఒక మహిళపై లైంగిక దాడి చేసిన ఘటనలో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.
శ్రీలంక క్రికెటర్లు విదేశాల్లో టోర్నీలు, ఐసీసీ ఈవెంట్లు ఆడుతున్నపుడు క్రమశిక్షణ తప్పడం.. బోర్డు ఆగ్రహానికి గురి కావడం కొత్త కాదు. గతంలో ఇలాంటి ఉదంతాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే జరిగాయి. ఐతే ఇప్పుడు ఒక క్రికెటర్ ఏకంగా రేప్ ఆరోపణలతో వేరే దేశంలో అరెస్టు కావడం అన్నది అనూహ్యమైన విషయం. ఎలగూ మ్యాచ్‌లు ఆడట్లేదు. ఖాళీగా ఉన్నాం కదా అని గుణతిలక ఏదో కొంటె వ్యవహారానికి పాల్పడ్డట్లు కనిపిస్తోంది. వ్యవహారం బెడిసి కొట్టి రేప్ కేసు వరకు వెళ్లింది.
శ్రీలంక జట్టు శనివారమే తమ చివరి మ్యాచ్ ఆడింది. ఇంగ్లాండ్ చేతిలో పోరాడి ఓడింది. ఆ మ్యాచ్ ముగియగానే లంక జట్టు స్వదేశానికి బయల్దేరేందుకు సన్నాహాలు చేసుకుంది. గుణతిలక మాత్రం ఈ కేసు వల్ల జట్టుతో పాటు స్వదేశానికి బయల్దేరట్లేదు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates