మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజా కవి గోరేటి వెంకన్న పాడిన పాట ఈ కలికాలంలో అక్షర సత్యంగా మారింది. మానవ సంబంధాలు, విలువలు, రక్త సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి అనేందుకు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు నిదర్శనం. మద్యానికి బానిసై తమను వేధిస్తున్న కన్న కొడుకును తల్లిదండ్రులు హత్య చేయించిన వైనం తెలంగాణలో సంచలనం రేపింది.
మద్యం తాగేందుకు డబ్బుల కోసం తమను వేధింపులకు గురి చేస్తున్న కొడుకును సుపారీ ఇచ్చి మరీ తల్లిదండ్రులు హత్య చేయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
సూర్యపేటలో నివసించే రాంసింగ్, రాణీబాయి దంపతులకు సాయినాథ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే, సాయినాథ్ మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. అంతేకాదు, ప్రతిరోజు కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వారిని వేధింపులకు గురి చేసేవాడు. అయితే, కొడుకు ప్రవర్తనతో విసిగి వేసారిపోయిన రామ్ సింగ్ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తమ కొడుకులో మార్పు వస్తుందని, ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో, కన్న కొడుకునే చంపుకునేందుకు ఆ తల్లిదండ్రులు కసాయిలుగా మారారు. కిరాయి హంతకులకు ఎనిమిది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించారు. ఈ క్రమంలోనే వారి దగ్గర నుంచి సుపారీ తీసుకున్న కిరాయి హంతకులు అక్టోబర్ 18న మిర్యాలగూడ మండలం కల్లేపల్లి మైసమ్మ ఆలయం వద్ద సాయినాథ్ తో కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత అతడి మెడకు ఉరి బిగించి హతమార్చారు. ఇక, శవాన్ని పాలకీడు మండలం శూన్యపహాడ్ వద్ద మూసీ నదిలో పడేశారు. నవంబర్ 19వ తేదీన మృతదేహం బయటపడటంతో పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో చివరికి తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి కొడుకును చంపించారని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. సాయినాథ్ తల్లిదండ్రులు రామ్ సింగ్, రాణి బాయ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో కలిపి మొత్తం ఏడుగురు ఈ కేసులో అరెస్టు అయ్యారు. ఇక, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాయినాథ్ హత్యకు వినియోగించిన నాలుగు కార్లు, బైక్, ప్లాస్టిక్ తాడు, రూ.23,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా, తమను వేధిస్తున్న కన్నకొడుకును కసాయిలుగా మారిన తల్లిదండ్రులు కడ తేర్చిన వైనం ఇప్పుడు తీవ్ర చర్చ నీయాంశమైంది.