హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన భార్య మిస్సయిన వ్యవహారం ఇపుడు జంటనగరాల్లో హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఆ వివాహిత కావాలనే భర్తను వదిలి వెళ్లిపోయిందా లేదంటే కిడ్నాప్ నకు గురైందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్టోబర్ 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్ లో సినిమాకు వెళ్లాడు. అయితే, సినిమా చూస్తుండగా మధ్యంలో శైలజ వాష్ రూంకు వెళ్లి వస్తానని చెప్పింది. అలా బయటకు వెళ్లిన శైలజ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భర్త భాస్కర్ రెడ్డి కంగారుపడ్డారు. వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారమిచ్చారు.
మహిళా సిబ్బంది సాయంతో వాష్ రూం మొత్త వెతికి చూశారు. ఎంత వెతికినా సరే, భార్య శైలజ జాడ తెలియలేదు. ఆ తర్వాత థియేటర్ పరిసర ప్రాంతాల్లో శైలజ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో, తన భార్య దగ్గర సెల్ కూడా లేదని, ఆమె జాడ తెలియడం లేదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబి మాల్ లోని సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
అయితే, గతంలో విశాఖ బీచ్ లో అదృశ్యమైన భార్య ఆ తర్వాత నెల్లూరులో తన ప్రియుడితో తేలిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.