హైదరాబాద్ లో నేడు జరిగిన అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసంగించిన చిరు…అక్కడికి వచ్చిన పలువురు ప్రముఖులను పేరుపేరునా ప్రశంసించారు. ఈ క్రమంలోనే గుర్తు పెట్టుకొని మరీ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి గురించి ప్రస్తావించారు. ఆయనపై చిరు ప్రశంసలు కురిపించారు. అయితే, కాసేపటి తర్వాత అనూహ్యంగా చిరంజీవిపై గరికపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది.
గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి కొంతమంది యువతీయువకులు స్టేజిపైకి వచ్చారు. గరికపాటి ప్రసంగాన్ని వారు పట్టించుకోలేదు. కెమెరామెన్లు, ఫోటో దిగాలనుకున్న అభిమానులందరూ.. చిరుని చుట్టుముట్టేయడంతో సభికుల అటెన్షన్ మొత్తం అటే వెళ్లింది. ఈ పరిణామంతో గరికపాటి ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, చిరంజీవిపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘చిరంజీవి గారు…అటువైపు జరుగుతున్న ఫోటో సెషన్‌ని ఆపేయాలి, లేకపోతే నేను వెళ్లిపోతా…దయచేసి అక్కడ మీరు ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపుకి రండి, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను..లేదంటే వెళ్లిపోతాను..నాకు మొహమాటమేమీ లేదు’ అంటూ గరికపాటి సీరియస్ గా చెప్పడంతో సభికులతోపాటు చిరంజీవి కూడా షాకయ్యారు. దీంతో అక్కడున్నవారు గరికపాటికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
గరికపాటిగారి ప్రసంగానికి తన ఫొటో సెషన్ అడ్డుతగులుతోందని గ్రహించిన చిరు…సెల్ఫీలు ఆపి తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. దీంతో, గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వ్యవహారంలో గరికపాటి నొచ్చుకోకుండా, చాలా కూల్‌గా చిరంజీవి వ్యవహిరించిన తీరు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా..చిరంజీవిపై గరికపాటి కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.