60 మంది విద్యార్థినుల నగ్న వీడియోలు.. నిజం కాదు

మొహాలిలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెంది 60 మంది విద్యార్థినుల నగ్న వీడియోలు బహిర్గతం అయినట్టు వార్తలు వ్యాపించడంతో ఛండీఘర్ యూనివర్సిటీలో గొడవలు చెలరేగాయి. పోలీసుల వాహనాలను విద్యార్థులు తగలబెట్టారు. అయితే, ఇవన్నీ అక్కడ చదివే ఒకమ్మాయి రహస్యంగా తీసిన వీడియోలు అని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఈ విషయం బయటపడిన వెంటనే తమ భవిష్యత్తును తలచుకుని 8 మంది అమ్మాయిలు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు, ప్రభుత్వం చెప్పిన వివరాలు మరో రకంగా ఉన్నాయి. ప్రచారం జరుగుతున్నట్టు అక్కడేమీ జరగలేదని, ఎవరి వీడియోలు బహిర్గతం కాలేదని, అసలు ఎవరి వీడియోలు చిత్రీకరించలేదని పోలీసులు తెలిపారు. 60 మంది అమ్మాయిల వీడియోలు పోర్న్ సైట్లో అప్లోడ్ చేశారన్నది కూడా అవాస్తవం అని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాదు, విద్యార్థినుల తల్లిదండ్రుల్లో తీవ్ర కలవరానికి దారితీస్తోంది. ప్రచారం జరిగింది ఒకటి, పోలీసులు చెబుతున్నది ఒకటి కావడంతో వాస్తవం ఏంటో ఇంకా నిర్దారణ కాలేదు. అయితే, ఇప్పటివరకు ఉన్న అధికారిక సమాచారం మాత్రం…

ఒకమ్మాయి తను తీసుకున్న వీడియోను తన మిత్రుడికి పంపగా, ఆవీడియో మాత్రమే పోర్న్ సైట్లో అప్ లోడ్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. దీని పై ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ స్పందించారు.

మన ఆడబిడ్డల గౌరవమే మా గౌరవం అని దీని మీద ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్జప్తి చేశారు. ప్రచారం జరుగుతున్నది నిజం కాదు, పూర్తి విచారణకు ఆదేశించామని అతి త్వరలో పూర్తి కచ్చితమైన సమాచారం వెలుగు చూస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.

60 మంది అమ్మాయిల వీడియోలు తీసినట్టు, అవి పోర్న్ సైట్లోకి అప్ లోడ్ చేసినట్టు అదంతా ఒకమ్మాయి ద్వారా జరిగినట్టు ప్రచారం అవుతన్నదంతా అబద్ధం అని… ఈ కేసులో నిందితురాలిగా పేర్కొంటున్న యువతి వీడియో తప్ప మరెవరి వీడియోలు లేవు అని, బయటకు రాలేదని తాను మరెవ్వరి వీడియోను కూడా రికార్డ్ చేయలేదని విద్యార్థిని మాకు తెలిపిందని మొహాలి ఎస్పీ మీడియాకు వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

“చండీగఢ్ యూనివర్శిటీలోని విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను, ఎవరూ దోషులను విడిచిపెట్టరు. ఇది చాలా సున్నితమైన విషయం. మన సోదరీమణులు & కుమార్తెల గౌరవానికి సంబంధించినది. మీడియాతో సహా మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది ఇప్పుడు సమాజంగా మనకు కూడా పరీక్ష, ” అని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.