దుబాయ్ లో అంబానీ లగ్జరీ విల్లా

ఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా.. కార్పొరేట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితాలో ఉన్న ముకేశ్ అంబానీ ఈ మధ్యన దుబాయ్ లో ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేసిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు.

తాజాగా ఆయన కొనుగోలు చేసిన లగ్జరీ విల్లా వివరాలు.. వాటి సౌకర్యాలతో పాటు.. దాని కోసం ఆయన చేసిన ఖర్చు లెక్క బయటకు వచ్చింది. పామ్ జుమేరా దీవుల్లో ఆయన కొనుగోలు చేసిన లగ్జరీ విల్లా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విల్లాలకు కేరాఫ్ అడ్రస్ గా దీన్ని చెబుతారు. 33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విశాలంగా ఉండే ఈ విల్లాకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను పోస్టు చేశారు. అంబానీ పేరును నేరుగా ప్రస్తావించని ఆయన.. దుబాయ్ లో ఒక బిలియనీర్ కొన్న విల్లా అంటూ ట్వీట్ చేశారు. దీని ధర మన రూపాయిల్లో 640 కోట్లుగా చెబుతున్నారు. ఈ విల్లాను ముకేశ్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ కోసం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ విల్లా ప్రత్యేకత ఏమంటే.. ఇందులో విశాలమైన పది బెడ్రూంలతో పాటు ప్రైవేటు స్పా.. రెండు భారీ స్విమ్మింగ్ పూల్స్ ఉండటంతో పాటు.. ఇటాలియన్ మార్బుల్ తో అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా చెబుతున్నారు. సకల సదుపాయాలకు నెలువుగా ఈ విల్లా ఉంటుందని చెబుతున్నారు. రూ.640 కోట్లు ఖర్చు పెట్టి కొన్న తర్వాత ఆ మాత్రం ఉండకుండా ఉంటుందా చెప్పండి?