పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారా ?

దేశంలోని యువత అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పెళ్ళి చేసుకునే విషయంలో పెద్ద ఆసక్తి చూపటం లేదట. చదవు, ఉద్యోగాలు, వృత్తులు లాంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న కారణంగా పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య బాగా పెరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెళ్ళికాని ప్రసాదులు పెరిగిపోతున్నారంటే అర్ధం పెళ్ళికాని అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లే అర్ధం.

జాతీయ యువజన పాలసీ 2014 ప్రకారం 15-29 మధ్య వయసు వారిని యువతగా చెబుతారు. ఈ ఏజ్ గ్రూపులో 2011 లెక్కల ప్రకారం వివాహాలు కాని వారి శాతం 17 ఉంటే 2019 నాటికి ఆ శాతం 23కి పెరిగింది. ఇదే సమయంలో పురుషుల్లో అవివాహితుల సంఖ్య 20 నుంచి 26 శాతానికి పెరిగింది. యువతుల్లో అవివాహితుల సంఖ్య 13 నుంచి 19 శాతానికి పెరిగింది. జమ్మూ-కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలో అవివాహితుల సంఖ్య బాగా పెరిగిపోతోంది.

ఇదే సమయంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అవివాహితుల సంఖ్య తక్కువగానే ఉంది. వివాహాలు ఆలస్యం కావటానికి లేదా అసలు వివాహాలంటే ఇష్టపడకపోవటానికి పైన చెప్పిన కారణాలతో పాటు లివ్ ఇన్ రిలేషన్ సంస్కృతి కూడా పెరుగుతుండటంతో పాటు సింగిల్ పేరెంటింగ్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. మెట్రో నగరాలైన ముంబాయి, బెంగుళూరు, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో లివ్ ఇన్ రిలేషన్ సంస్కృతి పెరిగిపోతోందట.

పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువైపోతున్న కారణంగా యువత ఆలోచనలు కూడా చాలా స్పీడుగా మారిపోతోందట. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాల్లో యువత వివాహాలు చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా అంటే అర్ధం ఇంట్లో పెద్దవాళ్ళ నిర్ణయాలను ఆమోదించటమే. యువతకు ఆర్ధికంగా పూర్తి స్వాతంత్ర్యం వచ్చేస్తుండటంతో చాలా కుటుంబాల్లోని పెద్దవాళ్ళు పిల్లల వివాహాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చేస్తున్నారట. దాంతోనే వివాహాలు ఆలస్యమవటమో లేదా విముఖత పెరిగిపోవటమే జరుగుతోందని అధ్యయనంలో తేలింది.