కొత్త కార్మిక చట్టం అమల్లోకి వస్తే ఇకనుండి పనిగంటలు 12 గంటలుగా మారబోతోంది. ప్రస్తుతం ఎక్కడైనా పనిగంటలంటే 8 గంటలు మాత్రమే. ఎక్కడైనా ఉద్యోగులు, కార్మికులు సానుకూలంగా ఉంటే మరో గంటపాటు పెరుగుతుంది. కానీ కేంద్రప్రభుత్వం పాతచట్టం స్ధానంలో కొత్తచట్టాన్ని తయారుచేసింది. ఈ చట్టాన్ని జూలై 1వ తేదీనుండి అమల్లోకి తీసుకురావటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రం ప్రయత్నాలు గనుక సక్సెస్ అయితే పనిగంటలతో పాటు అనేక చట్టాలు మారిపోవటం ఖాయం.
కొత్తచట్టంలో పనిగంటలు, భవిష్యనిధి, ఇంటికి తీసుకెళ్ళే వేతనం (శాలరీ టేక్ అవే) లాంటి అనేక అంశాల్లో సమూల మార్పులు వచ్చేస్తాయి. పెట్టుబడులను తీసుకురావటం, ఉద్యోగవకాశాలను పెంచటం కోసమే నాలుగు కార్మికచట్టాలను కొత్తవి తీసుకొస్తున్నట్లు కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మికసంక్షేమం, ఆరోగ్యరక్షణ, పని పరిస్ధితుల్లో సంస్కరణలు తీసుకురావటమే లక్ష్యమని నరేంద్రమోడి సర్కార్ ప్రకటించింది.
అయితే కేంద్రం చేసిన సంస్కరణల ప్రకటనలను ఉద్యోగ, కార్మిక సంఘాలేవీ నమ్మటంలేదు. ఎందుకంటే గడచిన ఎనిమిదేళ్ళుగా మోడి ప్రభుత్వం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కార్మికసంఘాలు మండిపోతున్నాయి. ఉద్యోగులు, కార్మికసంఘాల సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటివరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని కార్మికసంఘాల నేతలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఒకవేళ కొత్త కార్మికచట్టం గనుక ఆచరణలోకి వస్తే ఉద్యోగులు, కార్మికుల పనిగంటలు 8 నుండి 12 గంటలకు పెరుగుతుంది. అయితే వారానికి 48 గంటలకు మించి పనిచేయకూడదని చట్టంలోనే ఉంది. అంటే కొత్తచట్టం ప్రకారం చూస్తే వారంలో పనిదినాలు 4 మాత్రమే అని అర్ధమవుతోంది. కానీ ఈ విషయం కొత్తచట్టంలో స్పష్టంగా ఎక్కడాలేదు. ఓవర్ టైమ్ సమయం 50 గంటల నుండి 150 గంటలకు పెరగబోతోంది. కార్మికుడు+యజమాని జమచేసే భవిష్యనిధి పెరుగుతుంది. గ్రాస్ శాలరీలో 50 శాతం బేసిక్ శాలరీ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రయోజనాలు కాగితాల మీద బాగానే ఉంటుంది. అయితే చట్టం అమల్లోకి రాగానే ముందు యాజమాన్యాలు పనిగంటలను పెంచేస్తారు. రోజుకు 12 గంటలు పనిచేస్తే ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యం ఏమవుతుందో నరేంద్రమోడి ప్రభుత్వం ఆలోచించినట్లులేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates