మీ శానిటైజర్ మంచిదేనా?

మార్చికి ముందు మీరు శానిటైజర్ వాడతారా? అని అడిగితే.. నూటికి పది మంది కూడా వాడతామని చెప్పేటోళ్లు కనిపించరు. కొద్ది మంది మాత్రమే శానిటైజర్ వాడే అలవాటు ఉండేది. కరోనా దెబ్బకు లెక్కలన్ని మారిపోయాయి. చిన్నపిల్లాడికి మాత్రమే కాదు.. చదువులేనోళ్ల దగ్గర నుంచి అతి సామాన్యుల వరకూ అందరికి శానిటైజర్ గురించి తెలిసిపోయింది. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలంటే శానిటైజర్.. మాస్కులకు మించింది లేదన్న దానిపై అవగాహన పెరిగింది.

ఒకప్పుడు కొనాల్సిన అవసరం ఉందా? అనేటోళ్లే కాదు.. దాని గురించి తెలీనోళ్లకు సైతం ఇప్పుడది నిత్యావసరంగా మారింది. ప్రజల్లో పెరిగిన శానిటైజర్ల వాడకాన్ని సొమ్ముచేసుకోవటానికి నకిలీ రాయుళ్లు తెర మీదకు వచ్చేశారు. తక్కువ రకం శానిటైజర్లను తయారు చేస్తూ.. లాభ పడాలని చూస్తున్నారు. వారి ప్రయత్నం ఓకే కానీ.. చౌకగా వచ్చే శానిటైజర్లతో జరిగే నష్టం.. చర్మ సమస్యలతో పాటు మరిన్ని అనారోగ్యాలు గ్యారెంటీ.

వైరస్ బారి నుంచి కాపాడే శానిటైజర్లలో ఇథనల్ (ఇథైల్) ఆల్కహాల్ తో తయారు చేయాలి. కానీ.. దానికి బదులుగా తక్కువ రేటుకు వస్తుందన్న ఉద్దేశంతో మిథనాల్ (మిథైల్) ఆల్కహాల్ తో తయారుచేస్తున్నారు. ఇలాంటి వాటితో వచ్చే ముప్పు చేతులు బొబ్బలు ఎక్కటమే కాదు.. మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి శానిటైజర్ వాడాలన్నది ఇప్పుడో ప్రశ్న.

శానిటైజర్ ను కొనే వేళలో ఇథైల్ అని ఉన్నదే కొనాలి. అంతేకానీ మిథైల్ తో తయారు చేసింది కొంటే తిప్పలు తప్పవు. మీ పేస్టులో ఉప్ప ఉందా? అన్న యాడ్ ను గుర్తు చేసుకుంటే.. శానిటైజర్ లో ఇథైల్ ఉందా? అన్న ప్రశ్న మీకు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది.

మంచి శానిటైజర్ కు కొలమానం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంతకీ మంచి శానిటైజర్ లక్షణాల్ని చూస్తే..జిగురు.. నురుగు మాదిరి కంటే ద్రావణం మాదిరి ఉండే శానిటైజర్లతోనే ఎక్కువ ప్రయోజనం

— చేతుల్లో శానిటైజర్ వేసుకుంటే నిమిషంలో ఆవిరి కావాలి.

— అందుకు భిన్నంగా చేతులకు అంటుకొనే ఉంటే మాత్రం చర్మ సంబంధమైన సమస్యలకు అవకాశం ఉంది

— శానిటైజర్లలో 60 నుంచి 90 శాతం వరకూ ఆల్కహాల్ ఉండాలన్నది మర్చిపోకూడదు

— కనీసం 20 – 30 సెకన్లు చేతలకు రుద్దుకోవాల్సిన అవసరం ఉంది

— ఇథైల్ ఆల్కహాల్.. ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్.. ఎన్ ప్రొఫైల్ ఆల్కహాల్ తో ఉన్నవి వాడితే మంచిది

ఇదంతా ఒక ఎత్తు అయితే అదే పనిగా శానిటైజర్లను వాడటం కూడా మంచిది కాదు. అతి దేనికి వద్దన్న మాటకు తగ్గట్లే.. శానిటైజర్ల వినియోగంలోనూ జాగ్రత్తలు చాలా అవసరం. అదే పనిగా శానిటైజర్లు వాడితే చేతులు పొడిబారే అవకాశం ఉంటుంది. పగుళ్లు ఏర్పడటంతో పాటు.. దురద పుట్టటం.. మంట పెట్టే అవకాశం ఉంటుంది. కొన్నింటికి బొబ్బలుఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుందన్నది మర్చిపోూడదు. యాంటీ బ్యాక్టిరియా ఎక్కువగా ఉన్న శానిటైజర్లు వాడటం వల్ల మరో ముప్పు ఏమంటే.. యాంటీ బయాటిక్స్ మందులు వాడినప్పుడు అవి సరిగా పని చేయని పరిస్థితి ఉంటుంది. అందుకే.. అదే పనిగా శానిటైజర్లు వాడే కన్నా.. ఎంత అవసరమో అంత మాత్రమే వాడాలన్న విషయాన్ని మరవొద్దు.